కాకరేపుతున్న భీమవరం బెట్టింగ్ సర్వే
ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉంది. కానీ అప్పుడే గెలుపు, ఓటములపై తెలుగు రాష్ట్రాల్లో పందెం రాయుళ్ల మధ్య బెట్టింగులు మొదలైపోయాయి

-
ఏపీలో పుంజుకుంటున్న టీడీపీ-జనసేన
- ఏపీ గెలుపుపై మొదలైన బెట్టింగులు
- తెలంగాణలోనూ జోరుగా పందేలు
- జగన్ పార్టీ సీట్లపై కోట్ల పందేలు
విధాత ప్రత్యేకం: ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉంది. కానీ అప్పుడే గెలుపు, ఓటములపై తెలుగు రాష్ట్రాల్లో పందెం రాయుళ్ల మధ్య బెట్టింగులు మొదలైపోయాయి. ఈసారి ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని, వైసీపీ ప్రభుత్వానికి 50-60 సీట్లకు మించి రావని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సైతం జోరుగా పందెం పాటలు మొదలైనాయని తెలుస్తున్నది. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వాకింగ్ బ్యాచ్‌లో ఏపీకి చెందిన పలువురు బిల్డర్లు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ అధికారులు ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. కేవలం కడప జిల్లాకు చెందిన వారు తప్ప, ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు మాత్రం టీడీపీ, జనసేన ప్రభుత్వమే వస్తుందని లక్షల్లో బెట్టింగులు వేస్తున్నారని సమాచారం.
ఇక భీమవరం బ్యాచ్ మాత్రం ఇప్పటికే సొంత సర్వే చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. భీమవరం బ్యాచ్ ఎలక్షన్ బెట్టింగులు 500 కోట్ల రూపాయలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే వారంతా కలిసి అత్యంత పకడ్బందీ సర్వే చేయించుకోగా, ఆ సర్వేలో జగన్ పార్టీకి ఈ ఎన్నికల్లో 52 ఎమ్మెల్యే సీట్లకు మించవని తేలిందంటున్నారు. ఇదే భీమవరం బెట్టింగ్ బ్యాచ్ తెలంగాణ ఎన్నికల బెట్టింగుల సమయంలో సైతం ఇదే సర్వే సంస్థతో సొంత సర్వే చేయించుకుందని, ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 62 నుంచి 64 సీట్లు వస్తాయని తేల్చిందని సమాచారం.
ఎన్నికల ఫలితాలు కూడా అంతే స్పష్టంగా రావడంతో ఆ సర్వే సంస్థతోనే ఏపీలో డిసెంబర్‌లో సర్వే చేయించారంటున్నారు. దీంతో టీడీపీ-జనసేన గెలుస్తుందని పందెం కాసేవాళ్లు మెజార్టీ సంఖ్యలో ఉండగా, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ వేసేవాళ్లు అతికొద్ది మంది మాత్రమే ఉంటున్నారని చెబుతున్నారు. దీంతో బెట్టింగు రాయుళ్లు వైసీపీ గెలిచే స్థానాలు 50-60 దాటవనే పాయింటుపై పందెం కాస్తున్నారు.