చెల్లెలు హస్తినకు, అన్న హైదరాబాద్‌కు..

వైఎస్‌ఆర్‌ తెలంగాణ అధ్యక్షురాలు హస్తినకు వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి

చెల్లెలు హస్తినకు, అన్న హైదరాబాద్‌కు..

వైఎస్‌ఆర్‌ తెలంగాణ అధ్యక్షురాలు హస్తినకు వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్టు ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించడానికి హైదరాబాద్‌కు రానున్నారు. అన్నా, చెల్లెలి పర్యటనల్లో ఒకటి రాజకీయపరమైనది కాగా మరొకటి రాజకీయేతర కార్యక్రమం. కానీ ఎన్నికల సమయం కాబట్టి జగన్‌ కేసీఆర్‌ల భేటీకి అధిక ప్రాధాన్యం ఉన్నది. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. వామపక్షాలు కూడా ఈ కూటమితో జతకట్టవచ్చు. అక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు.


విభజన తర్వాత కాంగ్రెస్‌ పరిస్థితి అలానే ఉన్నది. కానీ షర్మిల చేరికతో అక్కడి రాజకీయాలు మారనున్నాయి. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ విపక్ష పార్టీలకంటే అధికారపార్టీకే ఎక్కువ నష్టం చేస్తుంది అనేది వాదన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలితే సహజంగా అధికారపార్టీకి లాభిస్తుంది. కానీ ఇక్కడ షర్మిల తోపాటు అధికారపార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు అసంతృప్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.

నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని, అందుకే ఆమె పోటీకి దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇది వాస్తవమే అన్నది తేలింది. పార్టీ విలీనంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించనున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వచ్చినప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్యనేతలు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ కొన్ని నెలల తర్వాత ఆపార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఆమె వ్యక్తిగతం. దానికి మాకు సంబంధం లేదు. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మేము తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు. షర్మిల ఎవరు వదిలిన బాణం అనే చర్చ చాలా కాలం నడిచింది. కానీ ఆ బాణం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆమె కాంగ్రెస్‌ చేరుతారని, ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు ఆమెకు అప్పగిస్తారనే ప్రచారం మొదలుకాగానే ముందుగా కలవరం మొదలైంది వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లోనే. ఎందుకంటే రాజశేఖర్‌రెడ్డి అభిమానులు, ఆయన వెంట నడిచిన నాయకులంతా షర్మిలతో సాగుతారనేది వారి భయం. ఏపీకి గత యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాటిని సాధించడంలో గత టీడీపీ, ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయిని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. నాటి విభజన భావోద్వేగాలు ఇప్పుడు లేవు. రాజధాని, పోలవరం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకోవడం ఇవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి.

దీనికితోడు మొన్న బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీడీపీ అధినేత చంద్రబాబు యాధృచ్ఛికంగా కలిశారు. రాజకీయ నేతలు కలిసిప్పుడు రాజకీయాల గురించే మాట్లాడుకోవడం సహజమే. మొన్న తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు గండి పడకూడదనే తాము పోటీ నుంచి వైదొలిగినట్టు షర్మిల బహిరంగంగానే ప్రకటించారు. టీడీపీ కూడా పోటీ చేయలేదు. దీనికి కారణాలు బాబు అరెస్టు సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహరించిన తీరు, ముఖ్యంగా కేటీఆర్‌ స్పందించిన తీరు పట్ల ఇక్కడి టీడీపీ అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైందనేది ఒక వాదన అయితే గ్రేటర్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం వెనుక బాబే ఉన్నారనేది మరో వాదన.


అయితే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటే చంద్రబాబు టార్గెట్‌ జగన్‌, కేంద్రంలోని బీజేపీ. చంద్రబాబు అరెస్టు రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినప్పటికీ కేంద్రం సహకారం లేకుండా ఆయన ఇదే సాధ్యమ్యేదా? అన్నది టీడీపీ నేతల ప్రశ్న. ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు రానున్న రోజుల్లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో కలిసి పనిచేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏపీ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్నా, విభజన హామీల సాధించుకోవాలన్నా కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యమౌతుందన్నది అందరి అభిప్రాయం. ఎందుకంటే గత పదేళ్లుగా ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యం.

ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఏపీకి ఏం చేయకున్నా వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, వాళ్లు పార్లమెంటులో తెచ్చే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. దీంతో బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి అనడానికి ఇదే నిదర్శనం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడించడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన ఇప్పటికే అవగాహనకు వచ్చాయి. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ఎస్‌ఆర్‌సీపీ సీట్లు తగ్గించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పనిచేయవచ్చు.

ఈ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతోపాటు కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం ఎలా? కొంతమంది ఎమ్మెల్యేలను మార్చినా ఫలితం అనుకూలంగా ఉంటుందా? ఎలాంటి వ్యూహాలను అవలంబించాలన్న విషయాలు జగన్‌ కేసీఆర్‌తో భేటీ సందర్భంగా చర్చకు రావొచ్చు. వీరిద్దరి కలయికకు రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదని బైటికి చెప్పినా నెల రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలే జగన్‌ను హైదరాబాద్‌కు రప్పిస్తున్నాయని తెలుస్తోంది. కేసీఆర్‌తో జగన్‌ భేటీకి ఒక రోజు ముందే షర్మిల హస్తిన బాట పడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఇవే పెద్ద చర్చనీయీంశమయ్యాయి. కాంగ్రెస్‌లో చేరిక, భవిష్యత్తు కార్యాచరణపై రెండురోజుల్లో అన్ని విషయాలు చెబుతానని షర్మిల అన్నారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం జగన్‌ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? అన్నది చూడాలి.

అక్కడ అధికారం దక్కాలంటే ఇక్కడ తప్పుకోవాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారం మాదే,హ్యాట్రిక్‌ పక్కా అన్న బీఆర్‌ఎస్‌ నేతలు విస్తుపోయే తీర్పును ప్రజలు ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. 2014లో 67 స్థానాలే గెలుచుకున్న వైఎస్‌ఆర్‌సీపీ గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నది ప్రస్తుతం ప్రజావ్యతిరేకతతో పాటు సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేనాటికి ఇంకా పరిస్థితులు పూర్తిగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చడం వల్ల కొన్నిసీట్లు గెలిచినా మాతృరాష్ట్రంలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2104లో వైఎస్‌ఆర్‌సీపీకి, 2019లో టీడీపీకి అది తెలిసివచ్చింది. అందుకే 2018 తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకు వైఎస్‌ఆర్‌సీపీ దూరంగా ఉన్నది. గత అనుభవాల దృష్ట్యా టీడీపీ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం పోరాడుతున్న పార్టీలే కాదు, తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ రాజన్న రాజ్యం తెస్తాన్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు కూడా ఎన్నికల ముందు ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.