జనవరిలో కాంగ్రెస్‌లోకి షర్మిల?

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధ్యక్షురాలు కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తున్నది

జనవరిలో కాంగ్రెస్‌లోకి షర్మిల?
  • డిసెంబర్‌ మూడో వారంలో మళ్లీ చర్చలు!
  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకం?
  • ఏపీ ఎన్నికల్లో తల్లితో కలిసి ప్రచారం
  • వైఎస్‌ అభిమానులను ఆకర్షించే యత్నం
  • విశాఖ నుంచి విజయమ్మ పోటీ?
  • ఖమ్మం లోక్‌సభ బరిలో షర్మిల
  • లేదంటే కర్ణాటక నుంచి రాజ్యసభకు?
  • రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు

విధాత ప్రత్యేకం: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ) అధ్యక్షురాలు కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తున్నది. తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే తన లక్ష్యమని ప్రకటించి పార్టీ పెట్టిన షర్మిల.. తదుపరి రాజకీయ పరిణామాలు, బీఆరెస్‌ను ఓడించడం అనే తొలి లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ప్రకటించారు. నిజానికి అంతకు ముందే కాంగ్రెస్‌లో విలీనం మాట వినిపించింది. అయితే.. ఎన్నికల నేపథ్యంలో ఆ చర్చ వాయిదా పడిందని ప్రచారం జరిగింది. ఎన్నికలు ముగిసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో డిసెంబర్‌ 3వ వారంలో మళ్లీ చర్చలు పునః ప్రారంభం కానున్నాయని తెలుస్తున్నది.


షర్మిలకు పార్టీ అధిష్ఠానం ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చిందని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తన సేవలను ఉపయోగించుకుంటారనే చర్చ జరుగుతున్నది. దానితోపాటు.. రానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండేది. ఆ పార్టీకి ఇప్పటికీ సంస్థాగతంగా ఓటు బ్యాంకు ఉన్నది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై అక్కడి ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. తిరిగి పార్టీకి పునరుజ్జీవం పోయడానికి షర్మిల సేవలను పార్టీ అధిష్ఠానం వినియోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ, వైఎసీపీనే టార్గెట్‌

పార్టీలో చేరిన తర్వాత షర్మిల విశాఖపట్నం, విజయవాడలలో ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీలతో బహిరంగ సభలు ఏర్పాటు చేయించాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది. దీని వెనుక రెండు వ్యూహాలున్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తున్నది. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అమలుచేయకపోగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌పరం చేస్తున్నది. ఈ అంశాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా బీజేపీ దెబ్బతీయాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

విశాఖ నుంచి విజయమ్మ పోటీ?

షర్మిల తల్లి విజయమ్మను కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నుంచి పోటీకి నిలిపే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు నడుస్తున్నాయి. విజయవాడలోని అమరావతిలో మరో బహిరంగ సభ ఏర్పాటు చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కావాలని అక్కడి ప్రజలు ఆకాంక్షను మరోసారి తెరపైకి తేవడమే లక్ష్యమని చెబుతున్నారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు ఏలినా ఏపీ ప్రజలకు రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత తమదేనని ప్రజలకు కాంగ్రెస్‌ భరోసా ఇవ్వనున్నదని సమాచారం. అలాగే రాయలసీమలోనూ ఒక బహిరంగసభ ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారట. కానీ తన అన్నయ్య జగన్‌ పార్టీ ఓటు బ్యాంకు అస్థిరపరిచే ఉద్దేశం తనకు లేదని అక్కడ మాత్రం ప్రచారం చేయడానికి గాని, బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి షర్మిల సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.

ఖమ్మం లోక్‌సభ బరిలో లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు

విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత షర్మిల ఏపీ అసెంబ్లీ పోటీ చేస్తారా? లేదా అన్నదానిపై కూడా దాదాపు స్పష్టత వచ్చిందట. ఆమెను ఖమ్మం లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం యోచిస్తున్నదని సమాచారం. కుదరకపోతే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలనుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలుస్తుందా? వైసీపీ అధికారాన్ని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? అనే చర్చ జరుగుతున్న సమయంలోనే షర్మిల పార్టీ విలీనం మరోసారి తెరమీది రావడం ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.