జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు జగనన్నపైకే!

జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు జగనన్నవైపే దూసుకొస్తున్నది. అన్నతో విభేదాల నేపథ్యంలో దూరమై.. తెలంగాణలో తండ్రి పేరిట పార్టీ

జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు జగనన్నపైకే!
  • కాంగ్రెస్‌లో చేరబోతున్నానన్న షర్మిల
  • నేడు ఢిల్లీకి వెళుతున్నట్టు ధృవీకరణ
  • ఢిల్లీకి రావాలని ఆహ్వానించిన ఖర్గే
  • 4న లాంఛనంగా కాంగ్రెస్‌లో చేరిక
  • ఏపీలో బాధ్యతలు అప్పగించే చాన్స్‌
  • అన్న జగన్‌పై చెల్లెలి రాజకీయ పోరు

విధాత : జగనన్న వదిలిన బాణం.. ఇప్పుడు జగనన్నవైపే దూసుకొస్తున్నది. అన్నతో విభేదాల నేపథ్యంలో దూరమై.. తెలంగాణలో తండ్రి పేరిట పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆమె తన పార్టీ నేతలతో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసంలో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌లో విలీనం విషయాన్ని తెలియజేశారు. అనంతరం ఇడుపులపాయకు వెళ్లి, తన తండ్రి సమాధిపై తన కుమారుడి శుభలేఖను ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.


తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని, బుధవారం ఢిల్లీకి వెళ్లి కాంగెస్ పెద్దలను కలువబోతున్నానని షర్మిల ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఈ విషయంలో జరుగుతున్న ఊహాగానాలకు ఆమె తెరదించారు. ఏ బాధ్యతలో పనిచేస్తానన్నదానిపై ఒకటి రెండు రోజుల్లో అందరికీ స్పష్టతనిస్తానని తెలిపారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను తండ్రి వైఎస్సార్ సమాధిపై ఉంచి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి కొడుకు, కోడలితో వచ్చానని తెలిపారు. నూతన వధూవరులకు వైఎస్సార్‌తో పాటు ప్రజలు, మీడియా మిత్రుల దీవెనలు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కాంగెస్ పార్టీలో కలిసి పనిచేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నానని, అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిచ్చామన్నారు. తమ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్సార్టీపీ చాల పెద్ద పాత్ర పోషించిందని, కాంగ్రెస్ 31 నియోజకవర్గాల్లో కేవలం 10వేల మెజార్టీలోపుతో గెలిచిందని, ఇందుకు తాము పోటీ చేయకపోవడమే కారణమని చెప్పారు. వైఎస్సార్టీపీ పోటీ చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కాంగ్రెస్‌కు ఇబ్బందియ్యేదన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్‌కు తాను అందించిన సహకారం పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం కృతజ్ఞతను, విలువను చాటిందని, తన త్యాగానికి విలువనిచ్చి పార్టీలోకి ఆహ్వానించిందని చెప్పారు. నాకు కూడా కాంగ్రెస్‌లో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ దేశంలో కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని, ప్రతి ఒక్కరికీ భద్రతనిచ్చే పార్టీ అని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ను బలపరచాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పార్టీ ఇచ్చే బాధ్యతను విజయవంతంగా నెరవర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అన్ని విషయాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని వెల్లడించారు.


పీసీసీ పగ్గాలు?

ఈ నెల 4వ తేదీన ఢిల్లీలో ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరుతారని తెలుస్తున్నది. ఆమె ఏపీసీసీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని కొద్ది రోజులుగా భారీ స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల‌ ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. త్వ‌ర‌లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా.. సోద‌రుడు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆమె ప్ర‌చారం చేసే అవ‌కాశముంది. గ‌తంలో ఏపీ రోడ్ల దుస్థితిపై విమ‌ర్శ‌లు చేయ‌డం, తాజాగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు కుటుంబానికి క్రిస్మ‌స్ కేకు పంప‌డం వంటి చ‌ర్య‌లు ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. ఉదయం పార్టీ నేతలతో సమావేశమైన షర్మిల.. కాంగ్రెస్‌లో విలీనంపైనే ప్రధానంగా చర్చలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. బుధవారం పార్టీ నేతలతో కలిసి ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఏపీ పీసీసీ పగ్గాలు షర్మిలకు ఇవ్వాలన్న ఆలోచనలో రాహుల్‌గాంధీ ఉన్నట్టు తెలుస్తున్నది.

వైసిపికి షాక్ ఇవ్వబోతున్న ఏపీ కాంగ్రెస్

షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలోనే కాంగ్రెస్‌లోకి వలసలు ఉండే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. బుధవారం ఉదయం విజయవాడ నుంచి పలువురు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.