కాంగ్రెస్‌ టచ్‌లో 20 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి

20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని, లోక్‌సభ ఎన్నికలకు ముందే వారు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ టచ్‌లో 20 మంది బీఆరెస్‌ ఎమ్మెల్యేలు: జగ్గారెడ్డి
  • లోక్‌సభ ఎన్నికల్లోపే కాంగ్రెస్‌లో చేరిక
  • వారిని కాపాడుకునేందుకే రేవంత్‌ సర్కార్‌ కూలుతుందని బీఆరెస్‌ దుష్ప్రచారం
  • వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి ఒక బ్రోక‌ర్‌
  • జ‌గ‌న్ ముందే కేసీఆర్ కాళ్లు మొక్కాడు
  • కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు

విధాత‌, హైద‌రాబాద్‌: త‌మ ఎమ్మెల్యేల‌ను ర‌క్షించుకునేందుకు, కాంగ్రెస్‌లోకి జంప్ కాకుండా అడ్డుకోవాలనే ఆలోచనలోనే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు.. ఆర్నెల్లలో కాంగ్రెస్‌ సర్కారు పడిపోతుందని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి విమ‌ర్శించారు. స‌ర్కార్ ప‌డిపోతుందంటూ బ‌ద‌నాం చేస్తే బీఆరెస్‌ను ఎవ‌రూ వీడ‌ర‌నేది వారి కుట్ర సారాంశమని అన్నారు. వాస్తవానికి బీఆరెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లోపే ఆ 20 వారందరినీ పార్టీలోకి తీసుకుంటామని తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బీఆరెస్‌ నేతలు కృష్ణా జ‌లాల‌పై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉంటుందంటూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంద‌ని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆ 20 మందికి నిత్యం కాప‌లాకాసినా వారు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని అన్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందే బీఆరెస్ ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని తాను కలిసిన సమయంలో చెప్పానని తెలిపారు.


కేసీఆర్‌ కుట్రలను ఆయన పద్ధతిలోనే తిప్పికొడతాం

కేసీఆర్ కుటుంబ‌ రాజ‌కీయ కుట్ర‌ల‌ను అదే రీతిన తిప్పికొడ‌తామ‌ని, ఇందుకోసం పోలీసుల‌ను ఉప‌యోగించుకోమ‌ని జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రెండు నెల‌లు కాక‌ముందే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌ని బ‌ద‌నాం చేయ‌డం స‌రికాద‌ని అన్నారు. ప్ర‌జ‌లు సుఖంగా ఉండడం కేసీఆర్ కుటుంబానికి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు.


బీజేపీతో లాలూచీప‌డ్డారు..

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ, తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని అన్నార‌ని, బీజేపీ వ‌కాల్తా పుచ్చుకుని అలా మాట్లాడారా? అని జగ్గారెడ్డి ప్ర‌శ్నించారు. ఆయ‌న ఎంపీగా ఉన్నారా, కేసీఆర్‌కు బ్రోకర్‌గా పనిచేస్తున్నారా? అని నిలదీశారు. ఏపీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కే చంద్ర‌శేఖ‌ర్ రావు ఇద్దరూ బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌ల‌న్నారు. గ‌తంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వచ్చిన విజ‌య‌సాయి రెడ్డి.. ఆ సమయంలో కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేశార‌ని, అంటే జ‌గ‌న్ మొక్కిన‌ట్లేన‌ని ఆయ‌న‌ అన్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్ ప‌రువును జ‌గ‌న్‌, విజ‌య‌సాయి మంట‌గ‌లిపార‌ని మండిప‌డ్డారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు వేయి కోట్లు ఎన్నిక‌ల ఖ‌ర్చు కింద కేసీఆర్‌ చందా ఇచ్చారని ఆరోపించారు. సోనియా గాంధీ ద‌య‌వ‌ల్ల‌ రెండు రాష్ట్రాలు రావ‌డం, ఆ త‌రువాత‌ స్వ‌యం ప‌రిపాల‌న వ‌చ్చింద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో తెలంగాణ ఆర్థికంగా మ‌రితం ప‌రిపుష్టంగా ఎద‌గ‌కుండా ఉండేందుకు జ‌గ‌న్‌, కేసీఆర్ కుటుంబం కుట్ర‌లు చేస్తున్న‌ద‌న్నారు.



విజయసాయి రెడ్డి పెద్ద అజ్ఞాని…

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై తామూ కామెంట్లు చేయగలమని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. విజయ సాయిరెడ్డికి తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి వల్ల కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుండ‌డంతో అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నార‌న్నారు. రాష్ట్రం విడిపోకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా? అన్నారు. బానిసత్వంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీని జోకడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని దయాకర్ హామీ ఇచ్చారు.