ఆకలి బాధలో.. పిల్లి మాంసాన్ని పీక్కు తిన్న వ్యక్తి
ఆకలితో ఉన్న వారిలో కొందరు.. తమ కడుపును నింపుకునేందుకు దొరికిందల్లా తినేస్తుంటారు. అలా ఓ వ్యక్తి తన ఆకలిని తీర్చుకునేందుకు పిల్లిని పీక్కుతిన్నాడు.

తిరువనంతపురం : ఆకలితో అలమటించేవారు ఈ భూమ్మీద ఎందరో ఉన్నారు. బుక్కెడు బువ్వ కూడా దొరక్క ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. ఆకలితో ఉన్న వారిలో కొందరు.. తమ కడుపును నింపుకునేందుకు దొరికిందల్లా తినేస్తుంటారు. అలా ఓ వ్యక్తి తన ఆకలిని తీర్చుకునేందుకు పిల్లిని పీక్కతిన్నాడు. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నార్త్ కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో ఓ వ్యక్తి(27) నివసిస్తున్నాడు. అయితే ఆహారం దొరక్క ఐదు రోజుల నుంచి ఖాళీ కడుపుతో ఉన్నాడు. చివరకు ఓ బస్టాండ్ వద్ద చనిపోయిన పిల్లి అతనికి కనిపించింది. ఇక ఆకలిని తట్టుకోలేని ఆ వ్యక్తి.. ఆ పిల్లి మాంసాన్ని పీక్కతిన్నాడు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడి సొంతూరు అసోం అని తెలిసింది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా గత డిసెంబర్‌లో కేరళకు వచ్చినట్లు విచారణలో తేలింది. ఆ వ్యక్తి ఇచ్చిన మొబైల్ నంబర్‌తో అతని సోదరుడికి పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే అతన్ని అప్పగిస్తామని కేరళ పోలీసులు పేర్కొన్నారు. బాధితుడికి మానసిక, శారీరక సమస్యలు లేవని చెప్పారు.