ఆ గ్రామ ప్రజలు.. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లేయనున్నారు..

ఒక గ్రామానికి చెందిన ప్రజలు.. ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేస్తారు. ఇప్పటి వరకు అదే చూశాం. కానీ ఆ గ్రామ ప్రజలు మాత్రం.. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయనున్నారు. ఎందుకంటే ఆ గ్రామం రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది. సగ భాగం ఒక నియోజకవర్గం పరిధిలో, మరో సగభాగం ఇంకో నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో ఆ గ్రామానికి చెందిన ఓటర్లు.. ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేయనున్నారు. మరి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే ఛత్తీస్‌గఢ్ వెళ్లాల్సిందే.
ఛత్తీస్‌గఢ్‌లోని అంజోరా గ్రామం అది. దుర్గ్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల సరిహద్దుల మధ్య అంజోరా గ్రామం ఉంది. అయితే ఈ గ్రామం దుర్గ్ రూరల్ నియోజకవర్గం, రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గాల సరిహద్దుల్లో రెండు భాగాలుగా చీలిపోయింది. కొన్ని వీధులు దుర్గ్ రూరల్ పరిధిలోకి, మరికొన్ని వీధులు రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గం పరిధిలోఉన్నాయి. ఇక అంజోరాకు రెండు గ్రామపంచాయతీలు ఉన్నాయి. రాజ్‌నంద్‌గావ్ పరిధిలో అంజోరా, దుర్గ్ పరిధిలో అంజోరా(కేహెచ్) బీ అనే పంచాయతీలు ఉన్నాయి.
రాజకీయ నాయకులు తికమక
అయితే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంజోరాకు వస్తున్న రాజకీయ నాయకులు కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారు. 5 వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో.. ఎవర్నీ ఓట్లు అడగాలో తెలియక తికమక అవుతున్నారు. అంజోరా అంతా ఇరు నియోజకవర్గాల అభ్యర్థుల జెండాలు, పోస్టర్లతో నిండిపోయింది. ఏ వీధి ఏ నియోజకవర్గం పరిధిలో ఉంది.. ఎవరు తమ ఓటర్లు అని తెలుసుకోలేక గందరగోళానికి గురవుతున్నారు.
తల్లిదండ్రులేమో దుర్గ్.. అత్తామామలేమో రాజ్‌నంద్‌గావ్..
ఈ సందర్భంగా అంజోరా పంచాయతీ సర్పంచ్ అంజు సాహూ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ప్రచారం ఆయా పార్టీలను గందరగోళానికి గురి చేస్తుందని తెలిపారు. నవంబర్ 7వ తేదీన రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో భాగంగా నవంబర్ 17న దుర్గ్ రూరల్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. తమ తల్లిదండ్రులేమో అంజోరా బీ ఏరియాలో ఉన్నారు.. వారు దుర్గ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తారు. తమ అత్తమామలేమో రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తారని చెప్పారు.
అంజోరా బీ గ్రామ సర్పంచ్ సంగీత సాహు భర్త మహాంకాళ్ సాహూ మాట్లాడుతూ.. రాజ్‌నంద్‌గావ్ జిల్లా 1973లో ఏర్పాటైందని తెలిపారు. పూర్వపు మధ్యప్రదేశ్‌లో దుర్గ్ జిల్లాలోని కొంతభాగాన్ని రాజ్‌నంద్‌గావ్ జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అంజోరా గ్రామం రెండు పంచాయతీలుగా విడిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలోనూ గ్రామంలో సగ భాగం ఒక నియోజకవర్గంలో, మరో సగభాగం ఇంకో సెగ్మెంట్‌లో ఉండే విధంగా చేశామని మహాంకాళ్ తెలిపారు.