యువతి ప్రాణాలను బలిగొన్న లాఫింగ్ గ్యాస్..! అది ప్రాణాంతకమా..?
లాఫింగ్ గ్యాస్.. ఈ పేరు వినే ఉంటారు. నవ్వు తెప్పించేందుకు ఈ గ్యాస్‌ను వినియోగిస్తుంటారు. అయితే యూకేకు చెందిన ఓ యువతి తరుచుగా లాఫింగ్ గ్యాస్‌ను పీల్చడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది.

లాఫింగ్ గ్యాస్.. ఈ పేరు వినే ఉంటారు. దీని రసాయనిక నామం నైట్రస్ ఆక్సైడ్. నవ్వు తెప్పించేందుకు ఈ గ్యాస్‌ను వినియోగిస్తుంటారు. అయితే యూకేకు చెందిన ఓ యువతి తరుచుగా లాఫింగ్ గ్యాస్‌ను పీల్చడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయింది. అసలు లాఫింగ్ గ్యాస్‌ను పీల్చితే ప్రాణాలు పోతాయా..? అని సందేహం రావొచ్చు. కానీ ఇది నిజమే.
వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన బిజినెస్ స్టూడెంట్ ఎల్లెన్ మెర్సర్(24) గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. కార్డియో రెస్పిరేటరీ కారణంగా ఆమె కుప్పకూలినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది.
అసలు ఆమె మృతికి కారణాలు ఏంటని వైద్యులు విశ్లేషించగా, న్యూరోలాజికల్ కాంప్రమైజ్ అని తేల్చారు. ఎందుకంటే నైట్రస్ ఆక్సైడ్‌ను తరుచుగా బెలూన్ల ద్వారా పీల్చడం వల్ల, అది రక్త ప్రసరణపై ప్రభావం చూపడంతో పాటు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏర్పడుతాయని తెలిపారు. దీని కారణంగానే ఆమె కార్డియో రెస్పిరేటరికీ గురై ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఇదే వెల్లడైంది.
అయితే ఇంగ్లండ్‌లో గంజాయి తర్వాత డ్రగ్‌గా నైట్రస్ ఆక్సైడ్‌ను వినియోగిస్తారు. గంజాయి దొరక్కపోతే నైట్రస్ ఆక్సైడ్‌ను పీల్చి మత్తులో మునిగి తేలుతారని తేలింది. ఎల్లెన్ చనిపోయిన తర్వాత గతేడాది నవంబర్‌లో నైట్రస్ ఆక్సైడ్‌ను క్లాస్ సీ డ్రగ్‌గా దాన్ని నిర్ధారించారు. నైట్రస్ ఆక్సైడ్‌ను విక్రయిస్తే 14 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని అక్కడి అధికారులు హెచ్చరించారు. వినియోగించిన కూడా భారీ జరిమానా, ఇతరత్రా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంగ్లండ్‌లో దీన్ని హిప్పీ క్రాక్‌గా కూడా పిలుస్తారు. గతేడాది ఎండాకాలంలో 13 టన్నుల నైట్రస్ ఆక్సైడ్‌ను సీజ్ చేశారు. దీన్ని అధికంగా వినియోగించడం వల్ల ఎనీమీయాకు గురయ్యే అవకాశం ఉంది. నరాలు దెబ్బతినడంతో పాటు పారాలసిస్ వచ్చే అవకాశం ఉంది.