ఆఫ్ఘ‌నిస్తాన్‌ని ఓడించిన సౌతాఫ్రికా.. సెమీస్ రేసు నుండి ఔట్..!

ఆఫ్ఘ‌నిస్తాన్‌ని ఓడించిన సౌతాఫ్రికా.. సెమీస్ రేసు నుండి ఔట్..!

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ కప్ 2023 సెమీస్‌పై ఓ క్లారిటీ వ‌చ్చింది.తొలి స్థానంలో ఇండియా, రెండో స్థానంలో సౌతాఫ్రికా, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉండ‌గా, నాలుగో స్థానం ఎవ‌రు ద‌క్కించుకుంటార‌నే చ‌ర్చ గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తూ ఉంది. ఎట్ట‌కేల‌కి దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలు కావ‌డంతో ఆ జ‌ట్టు సెమీస్ నుండి త‌ప్పుకున్న‌ట్టు అయింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ కాగా, అజ్మతుల్లా ఓమర్జాయ్(107 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒంటరి పోరాటం చేసి ఆ జ‌ట్టుకి మంచి స్కోరు ద‌క్కేలా చేశాడు. ఇక లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది.

రాసీ వాన్ డెర్ డస్సెన్( 95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. క్వింటన్ డికాక్(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) అదిరిపోయే ఆరంభాన్ని అందించ‌డంతో సౌతాఫ్రికా సునాయాసంగా విజ‌యం సాధించింది.ఈ మ్యాచ్‌తో తాము చేజింగ్‌లో కూడా స‌త్తా చూపించ‌గ‌ల‌మ‌ని నిరూపించింది. అయితే ఈ టోర్నీలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చిన ఆఫ్ఘ‌నిస్తాన్ ఇప్పుడు పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు నేరుగా అర్హత సాధించింది. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ స్థానంలో పాక్ సెమీస్‌కి చేరాలి అంటే ఆ జ‌ట్టు 242 పరుగుల తేడాతో గెలవడం! లేదా 2.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించండం చేయాలి. ఇది కాకుండా పాక్ సెమీస్ చేరేందుకు మరో అవకాశమే లేదు. అయితే పాకిస్తాన్ సెమీస్ ఛాన్సుల గురించి రకరకాల ట్రోల్స్, మీమ్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. ‘సెమీస్ చేరాలంటే ఒక్కటే దారి, ఫస్ట్ బ్యాటింగ్ చేయండి, తర్వాత ఇంగ్లాండ్ టీమ్‌ని బయటికి రాకుండా లాక్ చేసేయండి. అప్పుడు టైమ్ అవుట్‌గా ద్వారా గెలిచి, సెమీ ఫైనల్ వెళ్లిపోవచ్చు అని సెటైర్స్ వేశాడు. మొత్తానికి ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పాకిస్తాన్ కూడా సెమీస్ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్టే. మొత్తానికి ఈ సారి సెమీస్‌కి భార‌త్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జ‌ట్లు చేరాయి.