మెగా హీరోలకి నడుస్తున్న బ్యాడ్ టైం..ఈ రూట్ నుండి డైవర్ట్ చేసే హీరో ఎవరు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్యామిలీ నుండి డజనుకి పైగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా ఎవరికి వారు తమదైన టాలెంట్‌తో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి వేసిన బాటలో పయనిస్తూ వచ్చిన ఈ మెగా హీరోలు ఇప్పుడు సరైన సక్సెస్ అందుకోలేక దిగాలుగా ఉన్నారు. మంచి హిట్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఒక్క హిట్ పడిందా వారిని ఆపే వారే లేరని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి కూడా ఈ మధ్య కాలంలో ఒక్క పెద్ద హిట్ లేదు. ఆయన చివరిగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో పవన్ దేవుడైతే…మేనల్లుడు భక్తుడి పాత్రల్లో కనిపించి మెప్పించారు. అయితే మూవీ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని అందుకోలేదు.
పవన్ చేతిలో చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నా కూడా అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎలక్షన్స్ తర్వాత పవన్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సాయిధరమ్ తేజ్ విషయానికి వస్తే ఆయన నటిస్తున్న గాంజా శంకర్ కొన్ని కారణాల వలన ఆగిపోయిందని తెలుస్తుంది. ఇక అతని కొత్త ప్రాజెక్ట్ ఏది ఇంతవరకూ పట్టాలెక్కించింది లేదు. విరూపాక్ష`తో వంద కోట్ల హీరోగా మారిన సాయి తేజ్ ధైర్యంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉంది.. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన `వాల్తేరు వీరయ్య`తో భారీ విజయం అందుకున్నా ఆ తర్వాత వచ్చిన `భోళా శంకర్ భారీ ఫ్లాప్ వచ్చింది. ఈ క్రమంలో హిట్ మేకర్ విషయంలో ఆచితూచి వశిష్టతో తన 156వ సినిమాని పట్టాలెక్కించాడు. 157వ సినిమా తన కూతురు నిర్మాణంలో చేస్తానని ప్రకటించిన దానిని పక్కన పెట్టినట్టు సమాచారం.
ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే ఉప్పెన సినిమా తర్వాత మనోడికి ఒక్క హిట్ రాలేదు. ఆది కేశవ దెబ్బతో ఇంకా కోలుకోలేదు. అందుకే కొత్త ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక మరో మెగా వారసుడు వరుణ్ తేజ్ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ఆపరేషన్ వాలెంటైన్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అవుతాడు అనుకుంటే అతనికి భారీ నిరాశనే మిగిల్చింది.ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. ఇక అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ మెగా హీరోగా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు సినిమాలే చేయడం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రం స్వింగ్‌లో వారు ఉన్నారు. రానున్న సినిమాలతో వారు ఎంతటి విజయం అందుకుంటారా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.