కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చ‌డం కూడా కష్టమేనట!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం.. పెట్టిన‌ ఖ‌ర్చుకు, వ‌చ్చే ఫ‌లితానికి పొంత‌న లేని ప్రాజెక్ట‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ తేల్చిపారేసింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చ‌డం కూడా కష్టమేనట!
  • రూపాయి ఖ‌ర్చుకు 52 పైస‌ల ఫ‌లితం!
  • వ్యయానికి, ఆదాయానికి పొంత‌న లేని కాళేశ్వ‌రం
  • అంచ‌నా వ్య‌యం 122 శాతం పెరుగుద‌ల‌
  • ఆయ‌క‌ట్టు క‌ల్ప‌న‌ ల‌క్ష్యం 52.22 శాత‌మే
  • ప‌రిపాల‌నప‌ర‌మైన అనుమ‌తులు లేవు
  • ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చ‌డం క‌ష్టం
  • రీ డిజైనింగ్‌తో 1,47,427.41 కోట్లకు వ్య‌యం
  • పాత ధ‌ర‌ల‌తోనే డీపీఆర్ రూప‌క‌ల్ప‌న‌
  • కాళేశ్వ‌రం సాగునీటి మూల‌ధ‌న వ్య‌యం ఎక‌రానికి 6.42 ల‌క్ష‌లు.. నిర్వ‌హ‌ణ అద‌నం
  • అవ‌స‌రం లేకున్నా మూడో టీఎంసీ ప‌నులు
  • దీనివ‌ల్ల రూ. 28,151 కోట్ల అద‌న‌పు వ్య‌యం
  • కాళేశ్వ‌రం లిఫ్ట్‌ల‌న్నీ ఏకకాలంలోప‌ని చేస్తే గ‌రిష్ఠ‌ విద్యుత్ డిమాండ్ 203 మి. యూనిట్లు
  • ఎక‌రం సాగునీటి విద్యుత్ చార్జీ రూ.46,364
  • మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ లోతుల్లో నిటారుగా ప‌గుళ్లు
  • తేల్చిన కాగ్ నివేదిక.. అసెంబ్లీకి స‌మ‌ర్ప‌ణ‌

విధాత, హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం! మూడు బ‌రాజ్‌లు.. 15 రిజర్వాయర్లు.. 20 లిఫ్టులుతో అనేక ప్యాకేజీలుగా విభ‌జిత‌మైన బ‌హుళార్థ‌సాధ‌క ఎత్తిపోత‌ల ప‌థ‌కం! ఈ ప్రాజెక్టును తానే త‌న మెద‌డు రంగ‌రించి.. ఇంజినీర్‌గా మారి డిజైన్ చేశాన‌ని నాటి ముఖ్య‌మంత్రి గొప్ప‌గా చెప్పుకున్నారు! న‌దిని ఎత్తిపోశారంటూ భ‌జ‌న‌లు చేయించుకున్నారు! ప్ర‌పంచంలోనే నీటిపారుద‌ల రంగ అద్భుతంగా కీర్తింప‌జేశారు! రాష్ట్రంలో ఎక్క‌డ ఏ పొలానికి నీరుపారినా అదే కాళేశ్వ‌రం ఘ‌న‌తేన‌ని న‌మ్మించేశారు! కానీ.. ఇది.. పెట్టిన‌ ఖ‌ర్చుకు, వ‌చ్చే ఫ‌లితానికి పొంత‌న లేని ప్రాజెక్ట‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ తేల్చిపారేసింది. దీనికి ప‌రిపాల‌న ప‌ర‌మైన అనుమ‌తులు సైతం లేవ‌ని, విడివిడిగా అనుమ‌తుల జారీ చేశార‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికి ప్ర‌తిఫ‌లం 0.52 పైస‌లు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కాగ్‌ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ.38,500 కోట్ల‌తో మొద‌లుపెట్టిన ప్రాణ‌హిత – చేవెళ్ల ప్రాజెక్ట్‌కు రీ-డిజైనింగ్ పేరుతో రెండు ప్రాజెక్ట్‌లు, మూడు బ‌రాజ్‌లుగా మార్చి, 15 రిజ‌ర్వాయ‌ర్లు, 20 లిఫ్ట్‌ల‌తో రూ.1,51,168.21 కోట్ల‌కు ప్రాజెక్ట్ వ్య‌యాన్నిపెంచార‌ని నివేదిక పేర్కొన్న‌ది. ప్రాణ‌హిత‌- చేవెళ్ల డీపీఆర్ పూర్త‌యితే ఈ వ్య‌యం ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది. పైగా ఈ ప్రాజెక్ట్‌కు తెచ్చిన అప్పులు తీర్చ‌డం క‌ష్టమ‌ని స్ప‌ష్టం చేసింది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌నుంచి ఎలాంటి ఆదాయం లేదు కాబ‌ట్టి, దీని భారం బ‌డ్జెట్ పై తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపింది. ప్రాణ‌హిత‌- చేవెళ్ల ను విడ‌గొట్టి రీ-ఇంజినీరింగ్ చేసి కాళేశ్వ‌రం, ప్రాణహిత‌- చేవెళ్ల రెండు ప్రాజెక్ట్‌గా మార్చిన త‌రువాత దీని అంచ‌నా వ్య‌యం రూ.38,500 కోట్ల నుంచి రూ.85,651.81 కోట్లు అవుతుంద‌ని అంచ‌నా వేశారు. అంచ‌నాల్లోనే 122 శాతం వ్య‌యం పెరిగింద‌ని, కానీ ల‌క్ష్యంగా పెట్టుకున్న ఆయ‌క‌ట్టు మాత్రం కేవ‌లం 52.22 శాత‌మేన‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది. రీ- ఇంజినీరింగ్ త‌రువాత చేసిన మార్పుల వ‌ల్ల ఒక్క కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ వ్య‌యం రూ.1,47,427.41 కోట్ల‌కు పెరిగిందని తెలిపింది. రెండు ప్రాజెక్ట్‌ల‌కు క‌లిపి రూ.1,51,168.21 కోట్లుగా ఉంద‌ని తెలిపింది. అయితే 2022 మార్చి నాటికి కూడా ప్రాణ‌హిత‌- చేవెళ్ల డీపీఆర్ సిద్ధం కాలేద‌ని, డీపీఆర్ పూర్త‌యితే ప్రాజెక్ట్ నిర్మాణ వ్య‌యం ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని కాగ్ చెప్పింది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ డీపీఆర్ త‌యారీలో లోపాలున్నాయ‌న్న కాగ్‌.. తిరిగి ఆ డీపీఆర్ త‌యారు చేసిన వ్యాప్కోస్ సంస్థ‌కే కాళేశ్వ‌రం డీపీఆర్ అప్ప‌గించ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది.


సాగునీటికి అయ్యే మూల‌ధ‌న వ్య‌యం ఎక‌రానికి రూ. 6.42 ల‌క్ష‌లు

గ‌త ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ విలువ‌ను త‌క్కువ‌ చేసి చూపింద‌ని, పెరిగిన ధ‌ర‌ల‌ను చేర్చ‌కుండా ఉద్దేశపూర్వ‌కంగా పాత ధ‌ర‌ల‌తో డీపీఆర్ రూ పొందించార‌ని కాగ్ పేర్కొన్న‌ది. కేవ‌లం కేంద్ర జ‌ల సంఘం అనుమ‌తుల కోస‌మే ఇలా త‌క్కువ చేసి చూపార‌న్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. డీపీఆర్ త‌రువాత చేప‌ట్టిన మార్పులు, భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం, నిర్మాణ స‌మ‌యంలో చెల్లించాల్సిన వ‌డ్డీ మొద‌లైన వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే కేంద్ర జ‌ల‌సంఘానికి స‌మ‌ర్పించిన రూ. 81,911.01 కోట్లతో పోలిస్తే ప్ర‌స్తుత విలువ రూ.1,47,427.41 కోట్ల‌ను మించి పోయే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దీంతో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కింద సాగునీటికి అయ్యే మూల‌ధ‌న వ్య‌యం ఒక్క ఎక‌రానికి రూ. 6.42 ల‌క్ష‌లుగా తేలుతుంద‌ని తెలిపింది. ఇది కాకుండా నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు అద‌నంగా ఉంటాయి. త‌మ్మిడి హ‌ట్టి వ‌ద్ద ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్ట్‌కు త‌గినంత నీరు ల‌భ్య‌త లేద‌ని ఈ ప్రాజెక్ట్‌ను రెండు లింక్‌లుగా విడ‌గొట్టి రెండు ప్రాజెక్ట్‌లుగా గ‌త‌ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని కాగ్ తెలిపింది. మొద‌టి లింక్‌ను ప్రాణ‌హిత‌పై త‌మ్మిడి హ‌ట్టి వ‌ద్ద నిర్మించే బ్యారేజీ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకొని రెండు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందించాల‌ని ప్ర‌తిపాదించార‌ని, రెండ‌వ లింక్‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కింద‌కు చేర్చార‌ని తెలిపింది. ప్రాజెక్ట్ నిల్వ సామ‌ర్థ్యం పెంచేందుకు కొత్త‌గా మూడు బ్యారేజీలు, 15 రిజ‌ర్వాయ‌ర్ల‌ను ప్ర‌తిపాదించారు. దీని కింద 18.26 ల‌క్ష‌ల ఎక‌రాల కొత్త ఆయ‌క‌ట్టుతో పాటు ఇత‌ర ప్రాజెక్ట్‌ల కింద ఇదివ‌ర‌కే ఉన్న 4.71 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీటి లోటును పూడ్చాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు కాగ్ తెలిపింది.


రంగారెడ్డి జిల్లాకు తీర‌ని న‌ష్టం

ప్రాణ‌హిత‌- చేవెళ్ల ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి జిల్లాలో 2.47 ల‌క్ష‌ల ఎక‌రాల కొత్త ఆయ‌క‌ట్టును అభివృద్ధి చేయాల‌ని ప్ర‌తిపాదించ‌గా, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో దీనిని 50 వేల ఎక‌రాల‌కు త‌గ్గించారు. మిగిలిన 1.97 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఏవిధంగా నీరు అందించాల‌న్నదానిపై ప్రాజెక్ట్ డీపీఆర్‌లో ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది.


డీపీఆర్ ఆమోదం లేకుండానే..

2018 జూన్‌లో కేంద్ర జ‌ల‌సంఘం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ డీపీఆర్ ఆమోదించ‌కుండానే సాగునీటి శాఖ రూ.25,049.99 కోట్ల విలువ‌గ‌ల 17 ప‌నులను అప్ప‌గించింద‌ని కాగ్ తెలిపింది. ఈ మేర‌కు సాగునీటి పారుద‌ల శాఖ అనుచితంగా తొంద‌ర పాటును ప్ర‌ద‌ర్శించింద‌ని అక్షింత‌లు వేసింది. డీపీఆర్ ఆమోదం పొందిన త‌రువాత ప్రాజెక్ట్ ప‌నుల్లో మార్పులు చేశార‌ని, అవ‌స‌రం లేకున్నా పంపింగ్ సామ‌ర్థ్యాన్ని రోజుకు 3 టీఎంసీల‌కు పెంచార‌ని, దీని వ‌ల్ల రూ. 28,151 కోట్ల అద‌న‌పు వ్య‌యం అవుతుంద‌ని కాగ్ తెలిపింది. స‌వ‌రించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తాజా అనుమ‌తుల కోసం ప‌ర్య‌వ‌ర‌ణ అట‌వీ మంత్రిత్వ శాఖ‌కు పంప‌లేద‌ని కాగ్ చెప్పింది.



వానాకాలానికే స‌రిపోవు.. యాసంగికి ఎత్తేది ఎక్క‌డి నుంచి?

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కు ఆయువు ప‌ట్టు అయిన మేడిగ‌డ్డ బ‌రాజ్‌ నుంచి వ‌ర్షాకాలంలో మూడు నెల‌లు 2 టీఎంసీల చొప్పున 180 టీఎంసీల వ‌ర‌కు ఎత్తి పోసే అవ‌కాశం ఉంది. అయితే ప్రాజెక్ట్ నుంచి 11 టీఎంసీలు తాగునీరు, ఇత‌ర అవ‌స‌రాల‌కు మిన‌హాయించి సాగునీటికి 169 టీఎంసీలు కేటాయించింది. కేటాయింపుల ప్ర‌కారం వాన‌కాలం పంట‌కే ఈ నీరు స‌రిపోయే అవ‌కాశం లేద‌ని, యాసంగి పంట‌కు అందించ‌డానికి నీళ్లు మిగ‌ల‌క పోయే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపింది. పైగా గ‌త ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్ట్ ఖ‌ర్చును త‌క్కువ‌గా, ప్ర‌యోజ‌నాల‌ను ఎక్కువ‌గా చూపింద‌ని కాగ్ చెప్పింది. ఇత‌ర ప్రాజెక్ట్‌ల నీటి గ‌ణాంకాల ప్ర‌కారం ఒక్క టీఎంసీ నీరు స‌గ‌టున 10 వేల ఎక‌రాల‌కు స‌రిపోగా, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కింద ఒక్క టీఎంసీతో 17,668 ఎకరాల ఆయ‌క‌ట్టుకు సాగు నీరు అందించవ‌చ్చున‌ని చూపించ‌డంపై కాగ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేటాయించిన నీటి లెక్క‌ల ప్ర‌కారం ఒక్క టీఎంసీకి 10 వేల ఎక‌రాల చొప్పున 169 టీఎంసీల‌కు 16.90 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు మాత్ర‌మే సాగు నీరు అందే అవ‌కాశం ఉంద‌ని కాగ్ అంచ‌నా వేసింది.


రూపాయి ఖ‌ర్చుకు 52 పైస‌లే ఫ‌లితం

కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు విద్యుత్ చార్జీలు ఒక్క యూనిట్‌కు రూ.6.40 ఉండ‌గా, ఉద్దేశ పూర్వ‌కంగా విద్యుత్ చార్జీల‌పై వార్షిక వ్య‌యాన్ని యూనిట్‌కు రూ .3 చొప్పున త‌క్కువ రేటుతో అంచ‌నా వేశార‌ని కాగ్ తెలిపింది. వాస్త‌వంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్‌పై ఒక్క రూపాయి వ్య‌యం చేస్తే అద‌నంగా ప్ర‌యోజనం చేకూరాలి. కానీ కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌పై వెచ్చించే ప్ర‌తి రూపాయికి కేవ‌లం 52 పైస‌ల విలువ గ‌ల ప్ర‌యోజ‌నం మాత్ర‌మే చేకూరుతుంద‌ని కాగ్ వివ‌రించింది. వ‌డ్డీ చెల్లింపులు క‌లుపుకొంటే ఇంకా త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్న‌ది. రీ- ఇంజినీరింగ్ త‌రువాత లిఫ్ట్‌ల‌కు అయ్యే వార్షిక విద్యుత్ 5,643.30 మిలియ‌న్ యూనిట్లకు, రూ.3,55.34 వేల కోట్ల ఖ‌ర్చు పెరిగింద‌ని, అప్ప‌టికే అమ‌లైన ప‌నుల్లో కొన్ని భాగాలు నిర‌ర్థ‌కం కావ‌డంతో రూ.767.78 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు కాగ్ తెలిపింది.


యావ‌త్ రాష్ట్రానికి మించి విద్యుత్ వినియోగం

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కింద ఉన్న లిఫ్ట్‌ల‌న్నీ ఎక కాలంలోప‌ని చేసిన‌ప్పుడు గ‌రిష్ఠ‌ విద్యుత్ డిమాండ్ రోజుకు 203.02 మిలియ‌న్ యూనిట్లుగా తేలుతుంద‌ని, కానీ 2021-22లో రాష్ట్రం మొత్తం వినియోగించిన రోజువారీ విద్యుత్ కేవ‌లం 196.06 మిలియ‌న్ యూనిట్ల‌ని కాగ్ తెలిపింది. రాష్ట్రం మొత్తం వినియోగించే విద్యుత్ కంటే కాళేశ్వ‌రానికి వినియోగించే విద్యుత్ అధికంగా ఉంద‌ని తెలిపింది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కింద ఉన్న లిఫ్ట్‌ల‌న్నీపూర్త‌యిన త‌రువాత ప్ర‌తి ఏటా 14,344.39 మిలియ‌న్ యూనిట్లు అవ‌స‌రం అవుతుంద‌న్న‌ది. ప్ర‌స్తుతం రాష్ట్ర అవ‌స‌రాల‌కు స‌రిపోయే విద్యుత్‌లో 60 శాతం విద్యుత్‌ను బ‌య‌టి నుంచి కొనుగోలు చేసుకుంటున్న నేప‌థ్యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌తో స‌హా రాష్ట్రంలో ఉన్న ప‌లు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు విద్యుత్‌ను అందించ‌డం రాష్ట్రానికి స‌వాల్‌గా మార‌నుంద‌ని కాగ్ తెలిపింది.


ఏడాదికి ఎక‌రం సాగునీటి విద్యుత్ ఖ‌ర్చు రూ.46,364

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నీళ్ల మ‌న పొలంలోకి రావాలంటే ఏడాదికి విద్యుత్ ఖ‌ర్చు ఎక‌రానికి అక్ష‌రాలా రూ.46,364 అవుతుంద‌ని కాగ్ నిర్థారించింది. ఏడాదికి రూ.46 వేల విద్యుత్ చార్జీ అయితే వ‌చ్చే పంట ఈ విద్యుత్ ఖ‌ర్చుకు స‌రిపోద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్యక్త‌మ‌వుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఎత్తిపోయ‌డానికి అయ్యే విద్యుత్ చార్జీలు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు రూ. 272.70 కోట్లు క‌లిపి ప్ర‌తి ఏటా రూ.10,647.26 కోట్లు అవుతుంది. ఇది కాకుండా ప్రాజెక్ట్ ప‌నుల‌పై ఏటా రూ.2,760.92 కోట్ల త‌రుగుద‌ల ఉంటుంద‌ని కాగ్ తెలిపింది. నీటి చార్జీల వ‌సూలు ప్ర‌తిపాద‌న డీపీఆర్‌లో లేనందున కాళేశ్వ‌రానికి వ‌చ్చే ఆదాయం శూన్యం కాబ‌ట్టి ఈ ప్రాజెక్ట్ వ్య‌యాన్ని, నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని పూర్తిగా ప్ర‌భుత్వం కానీ, కాళేశ్వ‌రం ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ కార్పొరేష‌న్ భ‌రించాల్సి ఉంటుంద‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది.



మ‌ల్ల‌న్న సాగ‌ర్‌ లోతుల్లో ప‌గుళ్లు!

50 టీఎంసీల సామ‌ర్థ్యంతో నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌రే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్. ఈ రిజ‌ర్వాయ‌ర్ ప్ర‌తిపాదించిన ప్ర‌దేశం లోతుల్లో నిటారుగా ప‌గుళ్లు ఉన్న‌ట్లు ఎన్‌జీఆర్ ఐ ప్రాథ‌మిక అధ్య‌య‌నంలో తెలిపింది. లోతైన అధ్య‌య‌నాలేవీ నిర్వ‌హించ‌కుండానే రూ. 6,126.80 కోట్ల వ్య‌యంతో రిజ‌ర్వాయ‌ర్ నిర్మించింద‌ని కాగ్ ఆక్షేపించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ అంత‌టికి క‌లిపి ప‌రిపాల‌నా ప‌ర‌మైన అనుమ‌తి ఇవ్వ‌కుండా 73 అనుమ‌తులు ఇచ్చిన‌ట్లు కాగ్ తెలిపింది. నిధులు ఎలా స‌మ‌కూరుస్తున్నామ‌న్న విష‌యంపై ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఉత్త‌ర్వులు లేవ‌ని తెలిపింది. రుణాల సేక‌ర‌ణ‌కు కార్పొరేష‌న్‌ ఏర్పాటు చేసింద‌ని, 72.82 శాతం బ‌డ్జెటేత‌ర రుణాల నుంచే ఖ‌ర్చు చేశార‌ని కాగ్ పేర్కొన్న‌ది. కార్పొరేష‌న్ రుణ భారం అంతా రాష్ట్ర బ‌డ్జెట్‌పైనే ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 15 రుణ ఒప్పందాల‌కు 10 రుణాల చెల్లింపులు 2020-21లోనే ప్రారంభం కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ వాటిని మ‌రో రెండేళ్లు వాయిదా వేయ‌డం వ‌ల్ల‌ రూ.8,182.44 కోట్ల అద‌న‌పు వ‌డ్డీ భారం ప‌డింద‌ని తెలిపింది. తీసుకునే రుణాల‌కు మార్జిన్ మ‌నీ చెల్లించ‌లేక రూ.4,011.52 కోట్ల రుణాన్ని మార్జిన్ మ‌నీ కోసం మళ్లించ‌డంతో రూ.1381.42 కోట్ల అద‌న‌పు వ‌డ్డీ భారం ప్ర‌భుత్వంపై ప‌డింది. భారీ ప్రాజెక్ట్ కోసం ఏ వ‌న‌రుల నుంచి నిధుల‌ను స‌మ‌కూరుస్తున్నారో వివ‌రించే స‌మ‌గ్ర ప్ర‌ణాళిక ప్ర‌భుత్వం వ‌ద్ద లేద‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ భూసేక‌ర‌ణ‌లో తీవ్ర జాప్యం జ‌రుగుతుంద‌ని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం 98,110.33 ఎక‌రాల భూమిని సేక‌రించాల్సి ఉండ‌గా, 2002 మార్చి నాటికి 63,972.16 ఎక‌రాలు మాత్ర‌మే సేక‌రించార‌న్న‌ది. ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్ల‌ను రైతు పొలాల‌కు అందించే డిస్ట్రిబ్యూట‌రీ వ్య‌వ‌స్థ‌తో పాటు మ‌రికొన్ని ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన భూమిని ఇంకా గుర్తించ‌లేద‌ని కాగ్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏడు కొత్త రిజ‌ర్వాయ‌ర్ల ముంపు ప్ర‌భావిత కుటుంబాల‌కు పున‌రావాసం క‌ల్పించాల్సి ఉండ‌గా మూడింటికి మాత్ర‌మే పున‌రావాస కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌ని తెలిపింది. మిగిలిన నాలుగింటిలో నిర్వాసిత కుటుంబాల‌ను గుర్తించ‌లేద‌ని కాగ్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కింద డిస్ట్రిబ్యూట‌రీ పనులు కేవ‌లం 7శాతం మాత్ర‌మే పూర్త‌య్యాయ‌ని, ప్ర‌ధాన క‌లువ‌లు57 శాతం పూర్త‌య్యాయ‌ని తెలిపింది. రీ- ఇంజ‌నీరింగ్ చేసి ఆరేళ్లు గ‌డిచినా 3,43,148 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు డిస్ట్రిబ్యూట‌రీ ప‌నులు నిర్మాణ సంస్థ‌ల‌కు అప్ప‌గించ‌లేద‌ని కాగ్ పేర్కొన్న‌ది. ప్రాజెక్ట్ ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే సంపూర్ణ ప్ర‌యోజ‌నాలు సాధించ‌డానికి ఇంకా చాలా ఏళ్లు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని కాగ్ చెప్పింది.


మార్కెట్ ధ‌ర‌లు అంచ‌నా వేయ‌కుండానే…

పంపులు, మోట‌ర్లు, అనుబంధ ప‌రిక‌రాలను మార్కెట్ రేట్ల అంచ‌నాలు వేయ‌కుండానే కొనుగోళ్లు చేసిన‌ట్లు కాగ్ గుర్తించింది. ఈ ప‌రిక‌రాల కొనుగోళ్ల‌కు రూ.17,653.71 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపింది. ఇందులో నాలుగు ప‌నుల్లో కాంట్రాక్ట‌ర్లు ప‌రిక‌రాల కొనుగోలు చేసిన (మెస్స‌ర్స్ భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్ లిమిటెడ్ నుంచి) ధ‌ర‌ల‌ ఆడిట్ ప‌రిశీలించగా వేసిన ఎస్టిమేష‌న్ మొత్తం రూ.7,212.34 కోట్లు ఉండ‌గా వాస్త‌వ ధ‌ర రూ. 1686.59 కోట్లు ఉంద‌ని, దీనిని బ‌ట్టి చూస్తే రూ.5,525 కోట్లు అధికంగా ఉన్న‌ట్లు కాగ్ గుర్తించింది. బీహెఈఎల్ ప‌రిధిలో లేని వాటి కోసం వాస్త‌వ విలువ‌లో 30శాతాన్ని, గుత్తేదార్ల లాభం కోసం మ‌రో 20 శాతాన్ని అనుమ‌తించిన‌ప్ప‌టికీ గుత్తేదార్లకు క‌నీసంగా రూ.2,684.73 కోట్ల మేర‌కు అనుచిత ల‌బ్ది చేకూరే అవ‌కాశం ఉంద‌ని కాగ్ స్ప‌ష్టం చేసింది. గుత్తేదార్ల చెల్లింపుల కోసం అధిక చెల్లింపులున్నాయ‌ని కాగ్ తెలిపింది.