చివ‌రి మ్యాచ్‌లో క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్.. ఘ‌నంగా వీడ్కోలు పలికిన ఫ్యాన్స్

  • By: sn    breaking    Jan 06, 2024 10:23 AM IST
చివ‌రి మ్యాచ్‌లో క‌న్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్న‌ర్.. ఘ‌నంగా వీడ్కోలు పలికిన ఫ్యాన్స్

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎలాంటి బౌల‌ర్స్ నైన చీల్చి చెండాడుతాడు అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే ఆయ‌న టెస్ట్‌ల‌కి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తాడ‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఎట్ట‌కేల‌కి నేటితో ఆయ‌న టెస్టు కెరీర్ ముగిసింది. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో మూడో టెస్టులో విజయంతో డేవిడ్ వార్నర్.. తన అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన చివరి ఇన్నింగ్స్‌లో వార్నర్ హాఫ్ సెంచరీతో మెరిసి ఆసీస్‌కి మంచి విజ‌యాన్ని అందించాడు. 57 ప‌రుగులు చేసి వార్నర్ ఔట్ కాగా, అప్ప‌టికే ఆస్ట్రేలియా విజ‌యం ఖ‌రారైపోయింది. ఇక ఈ విజ‌యంతో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది ఆస్ట్రేలియా .

సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్ట్‌తో వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు .మ్యాచ్ అనంతరం వార్నర్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంత‌రం కామెంటేట‌ర్‌తో మాట్లాడిన వార్నర్..ఈ విజయంతో నా కెరీర్ ముగిసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. కొంత మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. అన్ని సంద‌ర్భాల‌లో నాతో పాటు ఉన్న భార్యకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచకప్ విజయాల్లో భాగమైనందుకు చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాను అంటూ వార్న‌ర్ ఆ స‌మ‌యంలో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. డేవిడ్ వార్నర్ మళ్లీ ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్ ఆడడం లేదు.

అయితే చివరి మ్యాచ్ కావ‌డంతో కళ్ల నుంచి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ డేవిడ్ వార్నర్ సహచరుల వద్దకు వెళ్లాడు. ఇక‌ మైదానంలో తన భార్యను కౌగిలించుకుంటూ కనిపించాడు. భార్యను కౌగిలించుకున్న అనంతరం కూడా డేవిడ్ వార్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. డేవిడ్ వార్నర్ కూడా తన ముగ్గురు కూతుళ్లను కౌగిలించుకుని కనిపించాడు. డేవిడ్ వార్నర్ కు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం టెస్ట్ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 44.5 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 26 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి.