విధ్వంస‌ర ఇన్నింగ్స్‌తో ఢిల్లీని ఫైన‌ల్ చేర్చిన షెఫాలీ..ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై మ‌ధ్య ఫైట్

  • By: sn    breaking    Mar 14, 2024 12:52 AM IST
విధ్వంస‌ర ఇన్నింగ్స్‌తో ఢిల్లీని ఫైన‌ల్ చేర్చిన షెఫాలీ..ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై మ‌ధ్య ఫైట్

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. గ‌త కొద్ది రోజులుగా క్రికెట్ ప్రియుల‌ని అల‌రిస్తున్న ఈ టోర్నీ ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కి చేరింది.ఢిల్లీ నిన్న జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో ఘ‌న విజ‌య సాధించి డైరెక్ట్‌గా ఫైన‌ల్‌కి చేరింది. ఇక 16న ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య ఫైట్ జ‌ర‌గ‌నుంది. ఈ రెండు జ‌ట్ల‌లో ఏ జ‌ట్టు గెలిస్తే ఆ జ‌ట్టు ఫైన‌ల్‌లో ఢిల్లీతో ఫైట్ చేయ‌నుంది. మొత్తానికి ఈ సారి డ‌బ్ల్యూపీఎల్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది.మ‌రి ట్రోఫీ ఎవ‌రు అందుకుంటారు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఓడించి టేబుల్ టాప్‌కి వెళ్ళింది. ముందుగా గుజ‌రాత్ జెయింట్స్ బ్యాటింగ్ చేయ‌గా, ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. భార్తీ ఫుల్మాలి(36 బంతుల్లో 7 ఫోర్లతో 42), కాథ్రిన్ బ్రైస్(22 బంతుల్లో 4 ఫోర్లతో 28) కొద్దిగా ప‌రుగులు చేయ‌డంతో గుజ‌రాత్ జెయింట్స్ ఆ మాత్రం అయిన స్కోరు చేయ‌గ‌లిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరజన్నే కాప్, శిఖా పాండే, మిన్ను మణి రెండేసి వికెట్లు తీయగా.. జెస్ జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టారు.

ఇక 127 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి ఘ‌న విజయాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) హాఫ్ సెంచరీతో అద‌ర‌గొట్ట‌గా.. జెమీమా రోడ్రిగ్స్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడింది. ఒక‌వైపు షెఫాలీ గ్రౌండ్ న‌లుమూల‌లా భారీ షాట్స్ ఆడుతూ గుజ‌రాత్ బౌల‌ర్స్‌కి చుక్క‌లు చూపిస్తుంటే జెమీమా నెమ్మ‌దిగా ఆడుతూ ప‌రుగులు రాబ‌ట్టింది. అయితే విజ‌యానికి రెండు ప‌రుగుల దూరంలో షెఫాలీ ఔట్ కాగా, జెమీమా విన్నింగ్ షాట్ కొట్టింది. ఇక గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వార్(2/20) రెండు వికెట్లు ప‌డగొట్టింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎవ‌రు త‌ల‌ప‌డ‌తారో అనేది వేచి చూడాలి.