11,062 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మార్చి 4 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బీఎడ్, డీఎడ్ చేసిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త వినిపించింది. 11,062 పోస్టుల‌తో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను గురువారం ఉద‌యం త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు.

11,062 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మార్చి 4 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బీఎడ్, డీఎడ్ చేసిన అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త వినిపించింది. 11,062 పోస్టుల‌తో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను గురువారం ఉద‌యం త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుద‌ల చేశారు. 11,062 పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్ర‌త్యేక కేట‌గిరి స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.

గ‌తేడాది కేసీఆర్ స‌ర్కార్ 5,089 పోస్టుల‌తో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను ర‌ద్దు చేస్తూ బుధ‌వారం రాత్రి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త నోటిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు చేసిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేయ‌ని వారు మాత్ర‌మే ఇప్పుడు కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ధ‌ర‌ను రూ. 1000గా నిర్ణ‌యించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ప‌ట్ట‌ణాల్లో ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌న్నారు.