డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎగబాకిన భారత్.. ఫైనల్ రేసు నుండి ఇంగ్లండ్ ఔట్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా పలు జట్లు టెస్ట్ మ్యాచ్‌లని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడుతున్నాయి. ఇండియా విషయానికి వస్తే తన 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్‌ను గత ఏడాది జులైలో వెస్టిండీస్‌లో 1-0 సిరీస్ విజయంతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో భారత్‌కి భారీ దెబ్బ తగిలింది. ఇక హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోవడం భారత్‌కి కొంత మైనస్ అయింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో గతంలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది.
కాని ఆ తర్వాత విజృంభించిన భారత జట్టు రెండో టెస్ట్,మూడో టెస్ట్ మ్యాచ్‌లలో మంచి విజయాలు సాధించడంతో తిరిగి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే భారత్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు మాత్రం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కిందకి పడిపోయింది. మూడో టెస్ట్ మ్యాచ్‌కి ముందు 25.00 పీసీటీ పాయింట్లతో 7వ స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు 21.87 పీసీటీ పాయింట్లతో 8వ స్థానానికి పడిపోవడం ఆ జట్టుని చాలా కలవరపరుస్తుంది. చూస్తుంటే ఇంగ్లండ్ జట్టు 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది అనే చెప్పాలి. ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఇదిలా ఉంటే రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఈ భారీ విజయంతో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరహో అన్పించగా, జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో (112; 2 వికెట్లు) సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌ల్లో అయిదు వికెట్లతో సత్తాచాటాడు.