మహిళలు ఏడు గంటలు నిద్ర పోవాల్సిందేనట..! లేదంటే గుండెపోటు తప్పదట..!!
ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. మరి ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మహిళలను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే వారికి కంటి నిండా నిద్రపోయే సమయం ఇవ్వాలి.

ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. మరి ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మహిళలను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే వారికి కంటి నిండా నిద్రపోయే సమయం ఇవ్వాలి. కానీ చాలా మంది మహిళలకు విశ్రాంతి ఉండదు. రాత్రి సమయంలో పడుకోవడం ఆలస్యమైనా సరే.. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పొద్దున నాలుగు, ఐదింటికి లేస్తుంటారు. వంట పనులు పూర్తి చేసి, పిల్లలను స్కూల్‌కు, భర్తను ఆఫీసుకు పంపేసరికి ఉదయం 10 అవుతుంది. మళ్లీ ఇతర పనుల్లో మునిగిపోతారు. మళ్లీ సాయంత్రం కాగానే డిన్నర్ రెడీ చేసి, తిని పడుకునే సరికి 11 అవుతుంది. అలా మహిళలు రోజుకు కనీసం నాలుగైదు గంటల కంటే ఎక్కువ సేపు నిద్రించరు. మరి ఈ నిద్ర సరిపోతుందా..? అంటే సరిపోదని అధ్యయనాలు చెబుతున్నాయి. కచ్చితంగా ఏడు గంటలు నిద్ర పోవాల్సిందేనని, లేదంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. 22 ఏండ్ల పాటు మూడు వేల మంది మహిళలపై అధ్యయనం చేశారు. 20 నుంచి 40 ఏండ్ల వయసు గల మహిళలు ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే.. వారిలో గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఆరు గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో గుండె సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు.. ఈ అధ్యయనం చేశారు. వారు ఎలా నిద్ర పోయారు..? వారి గుండె పరిస్థితి ఎలా ఉందనే విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు.
అయితే నిద్ర సరిగా లేకపోవడం వల్ల బీపీ పెరగడం, డయాబెటిస్ రావడం, రక్తనాళాలకు హానీ కలగడం వంటివి సంభవించే అవకాశం ఉంది. ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధ్య వయస్కులలో పెరుగుతున్న నిద్ర సమస్యలు, గుండె ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది. దీనిలో భాగంగా రాత్రిపూట కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. యువత కూడా నిద్ర విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది ఒత్తిడి సమస్యలను దూరం చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నిరాశ, ఆందోళన, ఇతర మానసిక సమస్యలను దూరం చేస్తుంది. సరైన నిద్ర మీ ఆలోచన తీరును మెరుగుపరుస్తుంది. ఇది తెలివైన నిర్ణయాలకు దారి తీస్తుంది.