Foreign Lawyers | దేశంలోని కోర్టులలో విదేశీ న్యాయవాదులూ వాదించవచ్చు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం
Foreign Lawyers | విధాత : ప్రతి అంశంలోనూ దేశీయ మంత్రం పఠించే బీజేపీ ప్రభుత్వ పాలనలో మరో విదేశీ అనుకూల నిర్ణయం వెలువడింది. దేశంలోని కోర్టులలో ఇకపై విదేశీ న్యాయవాదులు, విదేశీ న్యాయ సంస్థల ప్రతినధులు వాదించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీని సానుకూలతలు, ప్రతికూలతలపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇది అంతర్జాతీయ కేసులను ఇక్కడే పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని, దీని ద్వారా భారతీయ లాయర్లు సైతం లబ్ధి పొందుతారని […]

Foreign Lawyers | విధాత : ప్రతి అంశంలోనూ దేశీయ మంత్రం పఠించే బీజేపీ ప్రభుత్వ పాలనలో మరో విదేశీ అనుకూల నిర్ణయం వెలువడింది. దేశంలోని కోర్టులలో ఇకపై విదేశీ న్యాయవాదులు, విదేశీ న్యాయ సంస్థల ప్రతినధులు వాదించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీని సానుకూలతలు, ప్రతికూలతలపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇది అంతర్జాతీయ కేసులను ఇక్కడే పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని, దీని ద్వారా భారతీయ లాయర్లు సైతం లబ్ధి పొందుతారని అంటున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం విదేశీ న్యాయవాదులు లేదా విదేశీ సంస్థల ప్రతినిధులు నాన్ లిటిజియస్ కేసులలో వాదించేందుకు అవకాశం ఉంటుంది. ఏఏ రంగాల్లో విదేశీ న్యాయవాదులు వాదించవచ్చునో కేంద్ర న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.
కొత్త నిబంధనల ప్రకారం విదేశీ న్యాయవాదులు లేదా న్యాయవాద సంస్థలు దేశంలోని ఏ కోర్టులోనైనా లేదా చట్టబద్ధమైన లేదా రెగ్యులేటరీ అథార్టీ ముందైనా హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. జాయింట్ వెంచర్లు, మెర్జర్లు, అక్విజేషన్స్ మొదలైన కార్పొరేట్ వ్యవహారాల్లో విదేశీ లాయర్లు ప్రాక్టీస్ చేయవచ్చు. మేధో సంపత్తి హక్కులు, కాంట్రాక్టుల రూపకల్పన వంటి అంశాల్లో కూడా వారు భాగస్వాములు కావచ్చు. వివిధ వ్యాపార అంశాల్లో దేశ చట్టాలకు లోబడి సలహాలు ఇవ్వవచ్చు. ఏదైనా విదేశీ కంపెనీ లేదా ట్రస్ట్, సొసైటీ, కార్పొరేషన్ తదితరాల్లో న్యాయ సలహా ఇచ్చేందుకు లేదా వ్యక్తిగతంలా లాయర్ గా హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఏదైనా విదేశీ కేసు లేదా అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి సంబంధించిన వ్యవహారం అయి ఉండవచ్చు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ సంస్థ తన కార్యాలయాన్ని భారతదేశంలో తెరుచుకోవచ్చు. అంతర్జాతీయ న్యాయవాదిగా రిజస్టరయి ఒకరు లేదా ఎక్కువ మందిని తన సంస్థలో నియమించుకోవచ్చు. ఇతర విదేశీ న్యాయ సంస్థలతో న్యాయ సలహాల కోసం కాంట్రాక్టులు కుదుర్చుకోవచ్చు. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం పొందిన విదేశీ లాయర్లు మాత్రమే భారతదేశంలో కేసులను వాదించేందుకు అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వారు వాదించే కేసులు ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. వాస్తవానికి భారతదేశం గతంలో ఈ ఒప్పందం అమలుకు ప్రయత్నించినా కోర్టు ఉత్తర్వులు, వ్యతిరేకత కారణంగా వీలు కాలేదు. కానీ.. ఈ రోజు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో విదేశీ న్యాయవాదులు భారతదేశ కోర్టులలో నిర్దేశించిన అంశాలపై వాదించేందుకు వీలు కలుగుతున్నది.
సానుకూల అంశాలేంటి? ప్రతికూలతలేంటి?
భారతదేశ న్యాయవాదులు విదేశీ ప్రాక్టీస్ తో లబ్ధి పొందుతారు. ప్రస్తుతం వ్యాపార వివాదాలపై అనేక భారతీయులతో మధ్యవర్తిత్వాలు కొనసాగుతున్నాయి. తాజా నిర్ణయంతో వారు ఇక్కడే తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచస్థాయి న్యాయ ప్రమాణలకు అనుగుణంగా దేశంలోనూ న్యాయ సర్వీసులు మెరుగు పడే అవకాశం కలుగుతుంది. అదే సమయంలో కొన్ని విదేశీ సంస్థల గుత్తాధిపత్యం కొనసాగే ప్రమాదం లేకపోలేదు. ఇది ప్రపంచీకరణ కాలం. స్వతంత్ర దేశాలు మరింత స్వతంత్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థను బయటి వ్యక్తులకు తెరవక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ న్యాయ వ్యవస్థను బయటి వ్యక్తులకు తెరవక పోతే అంతర్జాతీయంగా తీవ్ర పర్యవసానాలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా దేశంలోని న్యాయ వ్యవస్థ ఈ కొత్త సవాలును స్వీకరించక తప్పదని దేశ న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.