IND Vs PAK | మారుతున్న పాక్‌ వైఖరి..! భారత్‌తో సంబంధాలకు పాక్‌ ఆరాటం..!

IND Vs PAK | మారుతున్న పాక్‌ వైఖరి..! భారత్‌తో సంబంధాలకు పాక్‌ ఆరాటం..!

IND Vs PAK | దాయాది దేశం పాకిస్తాన్‌ మొన్నటి వరకు భారత్‌తో కయ్యానికి కాలుదువ్వింది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ భారత్‌లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించింది. కొన్ని దేశాల అండ చూసుకొని మిడిసిపడింది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయి దేశ పరిస్థితి దారుణంగా మారింది. అదే సమయంలో మొన్నటి వరకు పెంచి పోషించిన ఉగ్రవాదమే ఆ దేశాన్ని వణికిస్తున్నది. ఈ క్రమంలో పాక్‌ దురహంకారం సడలుతూ వస్తున్నది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారత్‌తో తిరిగి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ముహమ్మద్‌ ఇషాక్‌ దార్‌ మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునః ప్రారంభించుకునేందుకు పాక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.

ఆయన చేసిన ప్రకటనతో దౌత్యపరంగా మళ్లీ సంబంధాలు సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఆగస్టులో భారత్‌-పాక్‌ మధ్య వాణిజ్య సంబంధాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. బ్రస్సెల్స్‌లో జరిగిన న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్‌కు హాజరైన తర్వాత లండన్‌లో విలేకరులతో విదేశాంగ మంత్రి దార్‌ విలేకరులతో మాట్లాడారు. తమ దేశానికి చెందిన నగదు కొరతతో అల్లాడుతుందని, వ్యాపార సంఘాలు భారత్‌తో తిరిగి వ్యాపారాన్ని కొనసాగించేందుకు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు జియో న్యూస్‌ పేర్కొంది. భారత్‌తో వాణిజ్యం పునరుద్ధరించాలని పాక్ వ్యాపారులు కోరుకుంటున్నారని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. తాము భారత్‌తో వాణిజ్య విషయాలను తీవ్రంగా పరిశీలిస్తామని దార్‌ పేర్కొన్నట్లుగా ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ కథనం తెలిపింది.

ఆర్టికల్‌ 370 తర్వాత..

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత పాకిస్థాన్ న్యూఢిల్లీతో దౌత్య కార్యకలాపాలను గణనీయంగా తగ్గించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పాకిస్థాన్‌ చెబుతోంది. చర్చల కోసం కశ్మీర్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలనే షరతును భారత్ ముందు ఉంచింది. అయితే, భారత్ దీన్ని పూర్తిగా తిరస్కరించింది. జమ్మూ-కశ్మీర్, లడఖ్ దేశంలో అంతర్భాగంగా ఉన్నాయని పాకిస్థాన్‌కు భారత్ స్పష్టంగా చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినగా.. 2021 ఫిబ్రవరిలో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇటీవల ప్రధాని నరేందర మోదీ సోషల్‌ మీడియా పోస్ట్‌లో పాక్‌ ప్రధానిగా ఎంపికైన షెహబాజ్‌ షరీఫ్‌ను అభినందించారు. శుభాకాంక్షలకు ప్రధాని మోదీకి షరీఫ్ సైతం కృతజ్ఞతలు తెలిపారు.