సౌతాఫ్రికాపై సత్తా చూపించిన భారత కుర్రాళ్లు.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ట్రోఫీ

ప్రస్తుతం భారత యువ టీం సౌతాఫ్రికా టూర్‌తో బిజీగా ఉంది. టీ20 సిరీస్‌ని సమం చేసిన భారత యువ ఆటగాళ్ల టీం ఇప్పుడు వన్డే సిరీస్‌ని దక్కించుకున్నారు. మూడో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 296 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేసి వన్డేల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. సంజూ శాంసన్‌కు బీసీసీఐ అన్యాయం చేసిందనే విషయాన్ని ఈ సెంచరీ ద్వారా నిరూపించాడని, వన్డే ప్రపంచకప్ జట్టులో అతనికి చోటిస్తే బాగుండేదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
101 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడగా.. ఆ సమయంలో తిలక్ వర్మ సాయంతో సంజూ శాంసన్ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. 110 బంతుల్లో సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ(77 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా, చివర్లో రింకూ సింగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. టోనీ డి జార్జి అత్యధికంగా 81 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన అతను మూడో మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు.
కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 36 పరుగులు చేయగా, హెన్రిచ్ క్లాసెన్ 21, రీజా హెండ్రిక్స్ 19, బ్యూరెన్ హెండ్రిక్స్ 18, కేశవ్ మహరాజ్ 10 పరుగులు చేశారు. జార్జి ఔట్ అయిన తర్వాత ఎవరు కూడా విలువైన భాగస్వామ్యం నెలకొల్పకపోవడంతో ఆ జట్టు ఓడిపోవల్సి వచ్చింది. భారత్ బౌలర్స్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లు తలో రెండు వికెట్లు తీశారు. అలాగే.. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో భారత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2018లో విరాట్ కోహ్లి సారథ్యంలో టీమిండియా ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-1తో కైవసం చేసుకోగా, మళ్లీ ఐదేళ్ల తర్వాత రాహుల్ నాయకత్వంలో ట్రోఫీ అందుకుంది.