ఎవరితోనూ మాట్లాడలేదు.. ఏమైనా ఉంటే మీకు చెబుతాగా!

ఎవరితోనూ మాట్లాడలేదు.. ఏమైనా ఉంటే మీకు చెబుతాగా!

న్యూఢిల్లీః బీజేపీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ఆదివారం స్పందించారు. కమల్‌నాథ్‌, ఆయన కుమారుడు కాంగ్రెస్‌ను వీడనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఆయన సన్నిహిత వర్గాలు కూడా ఆ వార్తలను ధృవీకరిస్తున్నాయి. కానీ కమల్‌నాథ్ మాత్రం.. తానెవరితోనూ మాట్లాడలేదని అన్నారు. ఈ విషయంలో మీడియా ఆయనను ప్రశ్నించగా.. శనివారం చెప్పిన సమాధానాన్నే రిపీట్ చేశారు. ఏమైనా ఉంటే మీకు చెబుతాను.. అన్నారు. ఆదివారం ఆయనను ఢిల్లీలో మీడియా ప్రశ్నించగా.. ‘నేను నిన్న కూడా చెప్పాను. అలాంటిదేమైనా ఉంటే మీ అందరికీ చెబుతాను. నేను ఎవరితోనూ మాట్లాడలేదు’ అన్నారు.


శనివారం కూడా ఇవే వ్యాఖ్యలు చేసిన కమల్‌నాథ్‌.. మీడియా అతిగా ఉద్రేకపడవద్దని సలహా ఇచ్చారు. బీజేపీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను మీరు ఖండిస్తున్నారా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఇది ఖండించడాన్ని గురించి కాదు, ఈ మాట మీరు అంటున్నారు. మీరే ఉద్రేకపడిపోతున్నారు. నేనేమీ ఉద్రేకపడటం లేదు. ఇటువైపైనా, అటువైపైనా ఏమైనా ఉంటే ముందుగా మీకే తెలియజేస్తాను’ అని బదులిచ్చారు.