ఘనంగా రోడ్డుకు పెళ్లి.. విందులో బిర్యానీ, స్వీట్లు వడ్డన
రోడ్డుకు పెళ్లి ఏంటి..? మరి విందు కూడానా..? ఆ విందులో బిర్యానీ, స్వీట్లు వడ్డించడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఇది నిజమే. కానీ వరుడు రోడ్డు, వధువు రోడ్డు ఇక్కడ లేరు.

తిరువనంతపురం : రోడ్డుకు పెళ్లి ఏంటి..? మరి విందు కూడానా..? ఆ విందులో బిర్యానీ, స్వీట్లు వడ్డించడం ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఇది నిజమే. కానీ వరుడు రోడ్డు, వధువు రోడ్డు ఇక్కడ లేరు. కేవలం రోడ్డు విస్తరణ కోసం మాత్రమే ఆ రహదారికి ఘనంగా వివాహం జరిపించారు. రహదారి విస్తరణ కోసం అవసరమైన నిధుల సేకరణకు రోడ్డుకు పెళ్లి చేసి ఆ గ్రామస్తులు వార్తల్లో నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొడియాత్తూరు గ్రామంలో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పైన రోడ్డు ఉంది. ఈ రహదారిని 1980ల్లో నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు ఆ రోడ్డును అభివృద్ధి చేయలేదు. ప్రస్తుతం కొడియాత్తూరు గ్రామ జనాభా నాటికి నేటికి 3 రెట్లు పెరిగింది. దీంతో గ్రామానికి వాహనాల రాకపోకలు పెరిగాయి. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ చేపట్టాలని స్థానికులు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పనులు ముందుకు సాగడం లేదు.
రోడ్డు విస్తరణ చేపడితే కొందరు భూములను కోల్పోతారు. వారికి నష్ట పరిహారం ఇవ్వాలి. కొత్త రోడ్డు నిర్మాణానికి రూ. 60 లక్షలు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో గ్రామానికి చెందిన 15 మంది ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున రూ. 15 లక్షల విరాళం అందించారు. ఇంకా రూ. 15 లక్షలు కావాలి. ఈ క్రమంలోనే కొడియాత్తూరు గ్రామస్తులకు పనం పయట్టు లేదా కురి కల్యాణం గుర్తొచ్చింది. ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి, నిధులు సమీకరిస్తారు. తాజాగా కొడియాత్తూరు గ్రామస్తులు సైతం నిధుల కోసం పనం పయట్టు కింద రోడ్డుకు పెళ్లి చేశారు.
నిధుల సమీకరణలో భాగంగా పలువురు ఎలాంటి పరిహారం ఆశించుకుండానే తమ భూములను, స్థలాలను విరాళంగా ఇచ్చారు. మూడు మసీదులు, రెండు ఆలయాలు, రెండు అంగన్‌వాడీలు, అప్పర్ ప్రైమరీ స్కూల్‌కు సంబంధించిన భూముల స్థలాలను కూడా ఇచ్చారు. 107 కుటుంబాలు భూమిని విరాళంగా ఇచ్చాయి. రోడ్డు నిర్మాణంలో మసీదులు, ఆలయాలు, అంగన్‌వాడీలు, స్కూల్‌కు సంబంధించిన కంపౌండ్ వాల్స్ పోనున్నాయి. వీటిని తిరిగి పునర్ నిర్మిస్తామని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ పోల్స్‌తో పాటు ఇతర సౌకర్యాలను పునరుద్దరిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఇక రోడ్డుకు పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత గ్రామస్తులంతా తమకు తోచినంత డబ్బును విరాళంగా ఇచ్చారు. పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్మును కూడా అందజేశారు. సమీప గ్రామాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విరాళాలు అందజేశారు. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.