ఘాటెక్కిన వెల్లుల్లి ధ‌ర‌లు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అన్న‌దాత‌లు

వంటింటి స‌రుకులు సామాన్యుల‌కు భారంగా మారిపోతున్నాయి. అస‌లు వంట చేయాలంటేనే గృహిణులు భ‌య‌ప‌డిపోతున్నారు.

ఘాటెక్కిన వెల్లుల్లి ధ‌ర‌లు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అన్న‌దాత‌లు

భోపాల్ : వంటింటి స‌రుకులు సామాన్యుల‌కు భారంగా మారిపోతున్నాయి. అస‌లు వంట చేయాలంటేనే గృహిణులు భ‌య‌ప‌డిపోతున్నారు. ప్ర‌తి కూర‌లో వినియోగించే వెల్లుల్లి ధ‌ర‌లు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరగడంతో కొనుగోలుదారులే కాకుండా రైతుల్లో కూడా ఆందోళన నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వెల్లుల్లి పంట‌ను కాపాడుకునేందుకు అన్న‌దాత‌లు త‌మ పొలాల వ‌ద్ద సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా జిల్లాలో వెల్లుల్లి పంట‌ను అధికంగా పండిస్తారు. ఇక్క‌డ్నుంచే క‌ర్ణాట‌క‌, ఏపీ, త‌మిళ‌నాడుతో స‌హా ప‌లు రాష్ట్రాల‌కు వెల్లుల్లి స‌ర‌ఫ‌రా అవుతోంది. ప్ర‌స్తుతం కిలో వెల్లుల్లి ధ‌ర రూ. 400 నుంచి రూ. 500 మ‌ధ్య పలుకుతోంది. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వెల్లుల్లి ధ‌ర‌లు పెర‌గ‌డంతో కొంద‌రు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రైతులు త‌మ వెల్లుల్లి పంట‌ను ర‌క్షించుకునేందుకు.. పంట పొలాల్లో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. అధిక పెట్టుబ‌డి పెట్టి పండించిన పంట దొంగ‌ల పాలు కాకుండా ఉండేందుకు రైతులు ఈ మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా వెల్లుల్లి రైతు రాహుల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. రూ. 25 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో 13 ఎక‌రాల్లో వెల్లుల్లి సాగు చేశాను. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. కోటి వ‌ర‌కు లాభం పొందాను అని తెలిపాడు. ఉన్న‌ట్టుండి కిలో రూ. 80 ఉండే వెల్లుల్లి.. రూ. 400 చేర‌డంతో వెల్లుల్లి పంట‌ను దొంగిలిస్తున్నార‌ని గుర్తు చేశాడు. ఈ క్ర‌మంలోనే ఉన్న పంట‌ను కాపాడుకునేందుకు సోలార్ శ‌క్తితో న‌డిచే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపాడు.

మ‌రో వెల్లుల్లి రైతు ప‌వ‌న్ చౌద‌రి మాట్లాడుతూ.. 4 ఎక‌రాల్లో రూ. 4 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో వెల్లుల్లి సాగు చేశాన‌ని తెలిపాడు. ఈ పంట విక్ర‌యించి రూ. 6 ల‌క్ష‌ల లాభం పొందాన‌ని చెప్పాడు. పంట‌ను కాపాడుకునేందుకు పొలం వ‌ద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నాడు. ఇటీవ‌లే త‌న పొలంలో వెల్లుల్లిని ఎత్తుకెళ్లార‌ని వాపోయాడు.