పిల్లలతో భిక్షాటన.. 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదన
ఓ తల్లి తన పిల్లల చేత బలవంతంగా భిక్షాటన చేయించింది. కేవలం 45 రోజుల్లోనే రూ. 2.5 లక్షలు సంపాదించింది ఆమె.

ఇండోర్ : ఓ తల్లి తన పిల్లల చేత బలవంతంగా భిక్షాటన చేయించింది. కేవలం 45 రోజుల్లోనే రూ. 2.5 లక్షలు సంపాదించింది ఆమె. తన ఎనిమిదేండ్ల కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసి ఇండోర్ వీధుల్లో భిక్షాటన చేసి భారీ స్థాయిలో డబ్బు సంపాదించినట్లు తేలింది.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఇండోర్‌తో సహా 10 నగరాలను యాచక రహితంగా మార్చడానికి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఇందుకోసం కొన్ని ఎన్జీవో సంస్థలు కూడా పని చేస్తున్నాయి. అయితే ఇండోర్‌లో ప్రవేశ్ అనే స్వచ్చంద సంస్థ ప్రెసిడెంట్ రూపాలీ జైన్.. భిక్షాటన చేసే వారిపై దృష్టి సారించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇండోర్ – ఉజ్జయిని రోడ్డులోని లవ్-ఖుష్ ఇంటర్‌సెక్షన్ వద్ద భిక్షాటన చేస్తున్న ముగ్గురు పిల్లలను రూపాలీ జైన్ గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. తమను గుర్తించిన ఇద్దరు మగపిల్లలు పారిపోయారని, కేవలం అమ్మాయి మాత్రమే అక్కడ ఉండిపోయిందని రూపాలీ తెలిపాడు. ఆ అమ్మాయిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పామని చెప్పారు.
అయితే ఈ ముగ్గురు పిల్లల తల్లి ఇంద్ర భాయిని విచారించగా, పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయించినట్లు తేలింది. కేవలం 45 రోజుల్లోనే రూ. 2.5 లక్షలు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ఒక లక్ష రూపాయాలను అత్తమామలకు పంపినట్లు అంగీకరించింది. మరో రూ. 50వేలు బ్యాంకు ఖాతాలో జమ చేశానని, మిగతా రూ. 50 వేలు ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. రాజస్థాన్‌లో ఆమెకు రెండు అంతస్తుల భవనంతో పాటు వ్యవసాయ భూమి ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
అయితే విచారణ సమయంలో ఇంద్రా భాయి ఎన్జీవో ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టు ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఇండోర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. నగరంలో భిక్షాటన చేస్తున్న పిల్లలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 10 మంది పిల్లలను రక్షించి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల గృహానికి పంపినట్లు పేర్కొన్నారు. పిల్లల చేత బలవంతంగా భిక్షాటన చేయిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.