Viral Video | మద్యం సీసాలను దొంగిలించిన కోతి.. తాగేందుకు యత్నం..

Viral Video | కోతులు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను దొంగిలించి తినడం సహజమే. విలువైన వస్తువులను కూడా దొంగిలిస్తుంటాయి కోతులు. అయితే ఓ కోతి ఏకంగా మద్యం బాటిళ్లను దొంగిలించింది. ఓ బాటిల్‌ను ఓపెన్ చేసి తాగేందుకు కూడా యత్నించింది కోతి.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీసు కమిషనరేట్ వద్ద బైక్‌లన్నీ పార్కింగ్ చేసి ఉన్నాయి. అక్కడున్న ఓ బైక్‌లో రెండు మద్యం బాటిళ్లు ఉండటాన్ని కోతి పసిగట్టింది. ఇక బైక్ వద్దకు చేరుకున్న కోతి రెండు మద్యం బాటిళ్లను బయటకు తీసింది. ఒక బాటిల్‌ను ఓపెన్ చేసి తాగేందుకు యత్నించింది.
కోతి మద్యం బాటిల్‌ను ఓపెన్ చేయడాన్ని గమనించిన ఓ వ్యక్తి దూరం నుంచి అరిచాడు. ఆ బైక్‌కు కొద్ది దూరంలోనే ఓ పోలీసు కూడా ఉన్నాడు. మొత్తానికి కోతి ఆ రెండు మద్యం బాటిల్స్‌ను అక్కడే వదిలేసి పారిపోయింది. ఈ దృశ్యాలను స్థానికులు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
అయితే గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు బంద్ ఉన్నప్పటికీ మద్యం ప్రత్యక్షం కావడంతో పోలీసులు విచారిస్తున్నారు. బైక్ ఎవరిది? ఎక్కడ్నుంచి మద్యం తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు మద్యం బాటిళ్లలో ఒకటి రాయల్ ఛాలెంజ్ కాగా, మరొకటి రాయల్ స్టాగ్.