Moscow killings : రష్యా రాజధాని మాస్కో (Moscow) లో మారణహోమం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధ్రువీకరించింది. క్రాకస్ సిటీలోని కన్సర్ట్ హాల్లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ‘ఫిక్నిక్’ సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
తొలుత భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. అప్పటికే సంగీత కార్యక్రమం అయిపోవడంతో అందరూ బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దాంతో జనం భయంతో హాల్లోపల ఉన్న సీట్ల కింద దాక్కున్నారు. కొన్ని నిమిషాలపాటు ఉగ్రవాదులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
హాల్లో దాక్కున్న వారిని బయటికి తీసుకొచ్చారు. కాల్పుల్లో గాయపడిన వారిని అంబులెన్స్‌లలో ఎక్కించి ఆస్పత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించిన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సాయుధులు కాల్పులు జరపుతున్న దృశ్యాలు, పలువురు భయాందోళనలతో పారిపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. ఈ దాడిలో ఉగ్రవాదులు బాంబులు కూడా విసిరినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అందుకే భవనంపై ఒక్కసారిగా మంటలు చెలరేగి, నల్లటి పొగలు వ్యాపించాయి. ఐదుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు పోలీసులకు చిక్కినట్టు సమాచారం.
కాగా, ఈ దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. ఘటనపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ స్పందించింది. ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఘటనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని చెప్పారు. కాగా, గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. 2002లో చెచెన్ మిలిటెంట్లు మాస్కో థియేటర్లో సుమారు 800 మందిని బందీలుగా చేసుకున్నారు. రష్యన్ ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి వారిని విడిపించాయి. ఈ సందర్భంగా 129 మంది బందీలు, 41 మంది మిలిటెంట్లు చనిపోయారు. 2004లో 30 మంది చెచెన్ సాయుధులు బెస్లాన్‌లోని ఓ పాఠశాలను ఆధీనంలోకి తీసుకొని వందల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించే క్రమంలో సుమారు 330 మంది చనిపోయారు. వారిలో సగం వరకు చిన్నారులే ఉన్నారు.