అగ్నిప్రమాదంలో చనిపోయిందనుకున్నారు.. కానీ చితికి నిప్పంటించే సమయంలో కళ్లు తెరిచింది..
ఓ 52 ఏండ్ల మహిళ అగ్నిప్రమాదంలో చనిపోయిందనుకున్నారు. కానీ శ్మశాన వాటికకు తీసుకెళ్లి చితికి నిప్పంటించే సమయంలో కళ్లు తెరిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

భువనేశ్వర్ : ఓ 52 ఏండ్ల మహిళ అగ్నిప్రమాదంలో చనిపోయిందనుకున్నారు. కానీ శ్మశాన వాటికకు తీసుకెళ్లి చితికి నిప్పంటించే సమయంలో కళ్లు తెరిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన ఒడిశాలోని గంజం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గంజం జిల్లాలోని బెర్హంపూర్ పట్టణంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న 52 ఏండ్ల మహిళకు గాయాలయ్యాయి. 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
కానీ బాధితురాలి భర్త వద్ద అంత డబ్బు లేకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. దాదాపు 13 రోజుల పాటు ఆమె ఇంట్లోనే కాలిన గాయాలతో బాధపడుతూ ఉంది. మంగళవారం ఉన్నట్టుండి ఆమె కళ్లు తెరవలేదు. శ్వాస కూడా తీసుకోలేదు. దీంతో ఆవిడ చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. చితికి నిప్పంటించే సమయంలో ఆమె కళ్లు తెరిచింది. దీంతో ఆ ప్రక్రియను ఆపేసి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.