పాక్ ఏడుపు ఆగేలా లేదు.. రోహిత్ ఫిక్స్ చేశాడంటూ పాక్ మాజీ క్రికెటర్ ఆరోపణలు

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.వాంఖడే వేదికగా జరిగిన మ్యాచులో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి నాలుగో సారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది. దాయాదుల జట్టు మాత్రం సెమీస్‌కి చేరుకోకుండానే ఇంటి బాట పట్టింది. అయితే భారత జట్టు అత్యద్భుత ప్రదర్శన పట్ల పాక్ ఆటగాళ్లు కుళ్లుకుంటున్నారు. ఫైనల్ చేరుకోవడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని పాక్ క్రికెటర్స్ ఏదో ఒక ఆరోపణలు చేస్తున్నారు. మొన్నామధ్య మాజీ క్రికెటర్ హసన్ రజా భారత్ కోసం ప్రత్యేక బాల్ ఇస్తున్నారని, అందుకోసమే వారికి అలా వికెట్స్ పడుతున్నాయని అన్నారు. ఇక తాజాగా మరో పాక్ మాజీ క్రికెటర్ రోహిత్ శర్మపై సంచలన ఆరోపణలు చేశారు.
వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ టాస్ ఫిక్సింగ్ చేస్తున్నాడని పాక్ మాజీ ఆటగాడు సికందర్ బఖ్త్ తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. తన ప్రత్యర్థి కెప్టెన్‌కు, ఐసీసీ అధికారులకు దూరంగా రోహిత్ కాయిన్ విసురుతుండడం వలన ఇండియాకు అనుకూలంగా టాస్ వస్తోందన్నాడు. అంటే రోహిత్ కాయిన్‌ను కాస్త దూరంగా విసరడం వల్ల.. ప్రత్యర్థి కెప్టెన్‌కు అది బొమ్మ పడిందా, బొరుసు పడిందా అని చెక్ చేసే అవకాశం లేదు. కాయిన్ చూసే వ్యక్తిని బీసీసీఐ మేనేజ్ చేయడం వల్ల టీమిండియా టాస్ గెలుస్తోందనేది అతడి అభిప్రాయంగా చెప్పుకొచ్చాడు. మీరు రోహిత్ శర్మ టాస్ వేసేటప్పుడు చూస్తే.. పక్కన ఉన్న కెప్టెన్‌కు దూరంగా పడేలా కాయిన్ విసురుతున్నాడు .పక్కన కెప్టెన్ దాదాపుగా ఆ కాయిన్ చూడటం కుదరనంతగా అలా విసరడం వలన ఫిక్సింగ్ జరుగుతుందని పేర్కన్నాడు సికందర్.
రోహిత్ శర్మ మాత్రమే ఇలా చేస్తున్నాడు, మిగతా కెప్టెన్స్ మాత్రం ఇలా చేయడం లేదు. దీని వెనక ఏదైన కారణం ఉందా అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతని కామెంట్స్ విన్న క్రికెట్ ప్రేక్షకులు అతనిపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిష్టాత్మక గేమ్‌లో ఇలా జరగడం అసహజం అని భారత్ గెలుపుని చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.