ఆసీస్ గ‌డ్డ‌పై కూలీల మాదిరిగా పాక్ ఆట‌గాళ్లు.. ఎంత క‌ష్ట‌మోచ్చింది..!

ఆసీస్ గ‌డ్డ‌పై కూలీల మాదిరిగా పాక్ ఆట‌గాళ్లు.. ఎంత క‌ష్ట‌మోచ్చింది..!

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెమీస్‌కి కూడా చేర‌కుండా ఇంటిబాట ప‌ట్టిన పాకిస్తాన్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా జ‌ట్టు భార‌త్‌తో మూడు టీ 20ల సిరీస్ ఆడుతుండ‌గా, చివ‌రి టీ20 నేడు ఆడ‌నుంది. ఇక ఇది పూర్తైన త‌ర్వాత పాక్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఆసీస్‌తో పోటీ ప‌డేందుకు కంగారూల గ‌డ్డ‌పై అడుగుపెట్టిన పాకిస్తాన్ జ‌ట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంద‌ని చెప్పాలి. ఎయిర్ పోర్ట్ లో పాక్ ఆట‌గాళ్ల‌కి స్వాగ‌తం ప‌లికేందుకు ఎవ‌రు రాలేదు. క‌నీసం పాకిస్థాన్ ఎంబసీ అధికారులు కూడా హాజరు కాలేదు. దీంతో చేసేది ఏమి లేక పాకిస్థాన్ ఆటగాళ్లు తమ లగేజీని స్వయంగా ట్రక్కులో ఎక్కించుకుని హోటల్‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది.

ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా, ఇది చూసిన వారు అయ్యో పాపం అంటున్నారు. వివ‌రాలలోకి వెళితే పాకిస్థాన్ ఆటగాళ్లు లాహోర్ విమానాశ్రయం నుంచి బయలుదేరి సిడ్నీ విమానాశ్రయంలో దిగారు. అప్పుడు పాక్ ఎంబసీ, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఎవరూ కూడా పాకిస్థానీ ఆటగాళ్లను స్వాగతించడానికి లేదా ఎస్కార్ట్ చేయడానికి రాక‌పోవ‌డంతో జట్టు సభ్యులు తమ లగేజీని స్వయంగా తీసుకెళ్లాల్సిన ప‌రిస్థితి తలెత్తింది. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియోలో పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్ తన సహచరుల కిట్ బ్యాగ్‌లను లోడ్ చేయడానికి ట్రక్కు లోపల నిలబడి ఉండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇక కెప్టెన్ బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిదితో సహా ఆటగాళ్లు ట్రక్‌లో లగేజీని ప్యాక్ చేస్తున్నారు. దీంతో పాక్ ఆటగాళ్ల బస, రాబోయే సిరీస్‌ల కోసం మొత్తం ఏర్పాట్ల గురించి ఊహాగానాలు ఎలా ఉండనున్నాయో అని అభిమానులు ఊహాలోచ‌న‌లు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 14 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్‌తో పాకిస్థాన్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుండ‌గా, త‌ర్వాతి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో, జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో ఓ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇటీవలే టెస్టు జట్టు కెప్టెన్‌గా 34 ఏళ్ల మసూద్‌ను నియమించగా, ఆయ‌న కెప్టెన్సీలో పాక్ ఏదైన అద్భుతం చేస్తుందా అనేది చూడాలి. ప్ర‌స్తుతం పాకిస్థాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. భారత్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి.