సినిమాల్లోకి ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. ఏకంగా ప‌వ‌న్ మూవీ అవకాశ‌మే కొట్టేసాడా..!

సినిమాల్లోకి ప‌ల్ల‌వి ప్ర‌శాంత్.. ఏకంగా ప‌వ‌న్ మూవీ అవకాశ‌మే కొట్టేసాడా..!

బిగ్ బాస్ సీజన్ సెవన్ అంతా ఉల్టా పుల్టా. ఈ షో రాను రాను ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇప్ప‌టికే 13వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజ‌న్ 7 మరికొన్ని వారాల్లో ముగిసిపోనుంది. టైటిల్ ఎవ‌రికి ద‌క్క‌నుంది, టాప్ 5లో ఎవ‌రు ఉంటారు అనే దానిపై ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఈ సీజ‌న్‌లో కామ‌న్‌మెన్‌గా వ‌చ్చిన రైతు బిడ్డ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ సారి విన్న‌ర్‌కి 50 లక్షలు ప్రైజ్ మనీతో పాటు బ్రేజా కారు, అలాగే డైమెండ్ నెక్ల్స్ గెలుచుకుంటారని నాగార్జున చెప్పారు. అంద‌రు త‌మ ఫ్యామిలీ కోసం ఆ 50 ల‌క్ష‌లు ఆడ‌తామ‌ని అన్నారు. కాని ప్ర‌శాంత్ మాత్రం త‌న‌లాగా బాధ‌ప‌డిన చాలా మంది రైతుల కోసం ఆ మొత్తాన్ని వాడ‌తాన‌ని పేర్కొన్నాడు.

రైతు బిడ్డ అలియాస్‌ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు టాప్ కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా ఉండ‌గా, ఆయ‌న‌కు శివాజి స‌పోర్ట్ చాలా ఉంది. హౌజ్‌లోనే కాకుండా ప్ర‌శాంత్‌కి బ‌య‌ట కూడా ఫుల్ స‌పోర్ట్ ఉంది. సోషల్‌ మీడియాలో అతని పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుండ‌గా, పలువురు సినీ ప్రముఖులు కూడా రైతుబిడ్డ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌కి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ప్ర‌శాంత్‌కి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమాలో క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని టాక్ న‌డుస్తుంది. పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా రూపొందుతుండ‌గా, ఇందులో పల్లవి ప్రశాంత్ ఓ కీల‌క పాత్ర కోసం ఎంపిక‌య్యాడ‌ని టాలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది.

డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షోను రెగ్యులర్‌గా ఫాలో అవుతారంట. సీజ‌న్‌7 కూడా ఆయ‌న మిస్ కాకుండా చూస్తుండ‌గా, ఈ సీజ‌న్‌లో అంద‌రి కన్నా ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అత‌నికి బాగా క‌నెక్ట్ అయ్యాడంట‌. పల్లవి ప్రశాంత్ గేమ్‌ డైరెక్టర్‌కు బాగా నచ్చ‌డంతో తాను తెర‌కెక్కిస్తున్న‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో తనకు ఒక పాత్ర ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యారట. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని ఓ టాక్ అయితే న‌డుస్తుంది. మ‌రి దీనిపై త్వ‌ర‌లో అయితే క్లారిటీ రానుంది. కాగా, ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ రీసెంట్ ఎపిసోడ్‌లో త‌న‌కు వ‌చ్చిన ఎవిక్ష‌న్ పాస్ రిజెక్ట్ చేయ‌డం మ‌నం చూశాం. ప్రేక్ష‌కుల అభిమానం త‌న‌కి ఎప్పుడు ఉంటుంద‌నే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.