ఇది కదా డెడికేషన్ అంటే.. పాత్ర కోసం మూడు రోజులు అన్నం తినకుండా 31 కిలోల బరువు తగ్గిన స్టార్ హీరో

ఈ రోజుల్లో అల్లాటప్పా సినిమాలు తీస్తే ఆదరించేవారు తక్కువయ్యారు. వైవిధ్యమైన సినిమాలు మాత్రమే ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ పెద్ద హిట్ అవుతున్నాయి. ప్రేక్షకులని అలరించేందుకు హీరోలు సైతం ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొత్త కథలని ఎంచుకుంటూ దానికి తగ్గట్టు తమ బాడీని మలచుకుంటూ వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నారు. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ అలరిస్తుంటారు. మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీరాజ్ ఓ పక్క మలయాళంలో హీరోగా పలు సినిమాలు చేస్తూనే ఇతర భాషలలో కూడా కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ చిత్రంలో ఫ్రెండ్ పాత్రలో కనిపించి సందడి చేశాడు.
అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’. ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఎప్పుడో పదేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లింది. ఇక ఆరేళ్ల నుండి చిత్రీకరణ జరుపుకుంటుంది. కేరళ నుంచి ఓ దేశానికి పని కోసం వెళ్లిన యువకుడు అక్కడ బానిసగామారి, ఇక అక్కడ నుండి తప్పించుకొని ఓ ఎడారిలోకి వెళితే అక్కడ దారి తెలియని పరిస్థితులలో ఏం జరిగింది అనే కథాంశంతో ఆడు జీవితం: ది గోట్ లైఫ్ తెరకెక్కించినట్టు సమాచారం. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు.
మరి కొద్ది రోజలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం పృథ్వీ రాజ్ ఎంత కష్టపడ్డాడు అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఎడారిలో దారి తప్పిపోయిన వ్యక్తిగా కనింపించాలని అన్నారు. నా ఫేస్ లో అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ రావాలని నేను మూడు రోజుల పాటు అన్నం తినడం మానేశా. మధ్యలో మళ్లీ కొంచెం తిని మరో మూడు రోజులు ఫుడ్ మానేసేవాడిని. కేవలం, నీళ్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తాగేవాడిని. మానసికంగా కూడా ఈ పాత్ర కోసం చాలా మారాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా కోసం నేను ఏకంగా 31 కిలోల బరువు తగ్గాను. పాత్రని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాను అని ఆయన వివరించారు. పాత్ర కోసం అంత కష్టపడ్డ పృథ్వీరాజ్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు