రాజీవ్ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుడు సుతేంద్ర రాజా అలియాస్ శంతన్ గుండెపోటుతో మృతి చెందారు. రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి విడుదలైన ఏడు మంది ముద్దాయిల్లో శంతన్ ఒకడు.

చెన్నై : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుడు సుతేంద్ర రాజా అలియాస్ శంతన్ గుండెపోటుతో మృతి చెందారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు నుంచి విడుదలైన ఏడు మంది ముద్దాయిల్లో శంతన్ ఒకడు. శ్రీలంక జాతీయుడైన శంతన్.. కాలేయ సమస్యలతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.
బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శంతన్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో సీపీఆర్‌కు చేయగా కాస్త స్పృహలోకి వచ్చాడు. మళ్లీ ఉదయం 7:50 గంటలకు మరోసారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి డీన్ డాక్టర్ వీ తేరని రాజన్ అధికారికంగా ప్రకటించారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో శంతన్‌కు మరణశిక్ష పడింది. 1999లో సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది కూడా. శంతన్‌తో పాటు మురుగన్, పెరారివాలన్‌కు కూడా మరణశిక్ష విధించారు. అయితే ఆ ముగ్గరికీ క్షమాభిక్ష పెట్టారు. దాంట్లో శంతన్ నవంబర్ 2022లో జైలు నుంచి విడుదలయ్యాడు. 1991లో జరిగిన రాజీవ్ హత్య కేసులో.. తమిళ టైగర్స్‌కు శంతన్ ఓ ఇంటెలిజెన్స్ సభ్యుడిగా పని చేసినట్లు సీబీఐ రిపోర్టు ప్రకారం తెలిసింది.