Sabitha Indra Reddy | దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రి మళ్లీ గెలిచేనా..?

Sabitha Indra Reddy | పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రి. ఆమె భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో.. ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే నాలుగు సార్లు అసెంబ్లీ గడప తొక్కిన సబితా ఇంద్రారెడ్డి మరోసారి పోటీ పడుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున సబిత బరిలో ఉన్నారు.
సబితా ఇంద్రారెడ్డి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. ఇంద్రారెడ్డి హోం మంత్రితో పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుగులేని నేతగా ఎదుగుతున్న సమయంలోనే 2000 సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి వరకు గృహిణిగా ఉన్న సబిత.. భర్త ఆశయ సాధనకు రాజకీయాల్లోకి వచ్చారు. 2000లో జరిగిన ఉపఎన్నికలో చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. 2014లో సబిత కుమారుడికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడంతో.. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు.
ఇక 2018 ఎన్నికల్లో అదే మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే తొలి మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. 2004లో గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమెపై కాంగ్రెస్ తరపున కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ పోటీ పడుతున్నారు.