అప్పుడు నా కాళ్లు మొక్క‌లేదు.. ఇప్పుడు మ‌న‌సు గెలుచుకున్నావ్ అంటూ విరాట్‌పై స‌చిన్ ప్ర‌శంస‌లు

అప్పుడు నా కాళ్లు మొక్క‌లేదు.. ఇప్పుడు మ‌న‌సు గెలుచుకున్నావ్ అంటూ విరాట్‌పై స‌చిన్ ప్ర‌శంస‌లు

న‌వంబ‌ర్ 15న న్యూజిలాండ్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య జ‌రిగిన తొలి సెమీస్‌లో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భార‌త్ 70 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి డైరెక్ట్‌గా ఫైన‌ల్‌కి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌, శ్రేయాస్ అయ్యార్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్ట‌గా మ‌హ్మ‌ద్ ష‌మీ ఏడు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్ల మైలు రాయి అందుకొని మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు ష‌మీ. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ తీయడం ద్వారా మహమ్మద్ షమీ ఈ ఫీట్ సాధించాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ష‌మీ ఆడింది కేవ‌లం 6 మ్యాచ్‌లే అయిన‌ ఇప్పటికే 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు.

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా కూడా షమీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఇక విరాట్ కోహ్లీ విష‌యానికి వ‌స్తే సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ శతక్కొట్టాడు. వన్డేల్లో 50 సెంచరీలు నమోదు చేసి ఈ ఘనతను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డ్‌ను కోహ్లీ అధిగమించి ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. ఓ వైపు అనుష్క శర్మ, మరోవైపు సచిన్ టెండూల్కర్ ముందు ఈ ఫీట్ సాధించడం త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అని మ్యాచ్ అనంత‌రం విరాట్ అన్నాడు.. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదని, అయితే ఓ చిత్రకారుడిని అయ్యుంటే. మాత్రం అద్భుత చిత్రంతో నా అనుభూతిని వివరించేవాడిని అని పేర్కొన్నాడు.

ఇక త‌న రికార్డ్‌ని విరాట్ బ్రేక్ చేయ‌డం ప‌ట్ల స‌చిన్ సంతోషం వ్య‌క్తం చేశాడు. టీమిండియాలోకి కొత్తగా విరాట్ వచ్చినప్పుడు సచిన్ ఆశీర్వాదం తీసుకోవాలని, కెరీర్‌లో గొప్ప స్థాయికి చేరుతావని, టీమ్ సంప్ర‌దాయ‌మంటూ అత‌నిని ఆట‌ప‌ట్టించేవారు. అయితే ఆ స‌మ‌యంలో కోహ్లీ కాళ్లు మొక్కబోతుంటే అడ్డుకున్నాను., ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగి తెగ నవ్వుకున్నానని చెప్పిన స‌చిన్.. వన్డేల్లో సునాయసంగా 50 శతకాలు బాద‌డం, అతని ప్రదర్శన పట్ల మేం గర్వపడుతున్నాం అన తెలియ‌జేశాడు. ఆ రోజు నువ్వు నా కాళ్లు మొక్కకపోయినా.. ఇంత అద్భుతంగా ఆడుతూ ఈ రోజు ఆటపై నీకున్న పిచ్చి, నైపుణ్యంతో నా హృదయాన్ని టచ్ చేశావ్ విరాట్ అంటూ స‌చిన్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 48.5 ఓవర్లలో 327 పరుగులకే కుప్పకూలింది.