చండీగఢ్‌ మేయర్‌గా కుల్దీప్‌.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు

చండీగ‌ఢ్ మేయ‌ర్ పోస్టుకు జ‌న‌వ‌రి 30న నిర్వ‌హించిన ఎన్నిక‌ల ఫ‌లితాన్ని సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది.

చండీగఢ్‌ మేయర్‌గా కుల్దీప్‌.. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు
  • దిద్దుబాట్లు జరిగిన 8 ఓట్లు చెల్లుతాయి
  • ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్ల మార్పు
  • కోర్టుకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన
  • రిటర్నింగ్‌ అధికారిపై కేసు పెట్టాలి
  • జనవరి 30న ఎన్నికల ఫలితం రద్దు

న్యూఢిల్లీ : చండీగ‌ఢ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ పోస్టుకు జ‌న‌వ‌రి 30న నిర్వ‌హించిన ఎన్నిక‌ల ఫ‌లితాన్ని సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. రిట‌ర్నింగ్ అధికారి చెల్ల‌నివిగా ప్ర‌క‌టించిన 8 ఓట్ల‌ను చెల్లుతాయ‌ని తేల్చి చెప్పిన ధ‌ర్మాస‌నం.. అవి ఆప్‌-కాంగ్రెస్ ఉమ్మ‌డి అభ్య‌ర్థి కుల్దీప్‌కుమార్‌కు అనుకూలంగా ఉండ‌టంతో ఆయ‌న‌నే మేయ‌ర్‌గా ప్ర‌క‌టించింది. ఈ ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌ల్లో దొడ్డిదోవ‌న బీజేపీ తొలుత విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆప్ చేసిన న్యాయ‌పోరాటం ఫ‌లితాన్నిచ్చింది. ఈ విష‌యంలో మంగ‌ళ‌వారం విచార‌ణ కొన‌సాగించిన చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. బ్యాలెట్‌ పత్రాలను పరిశీలించి, అవి సరిగానే ఉన్నాయని ధృవీకరించింది. అవన్నీ కుల్దీప్‌కు అనుకూలంగా పోల్‌ అయి ఉండటంతో ఆయననే విజేతగా ప్రకటించింది.


జనవరి 30న ఫలితాలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కూడా ఉన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల ప్రజాస్వామ్యానికి పూర్తి న్యాయం చేయడం తమ విధి అని పేర్కొన్నది. దానిని అడ్డుకునేవారిని అనుమతించేది లేదని పేర్కొన్నది. అలా అనుమతించడం మన దేశం ఆధారపడిన ప్రజాస్వామ్య భవన అత్యంత విలువైన సూత్రాలను నాశనం చేయడమేనని వ్యాఖ్యానించింది. అందుకనే ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకున్నదని తెలిపింది. పిటిషనర్‌కు వచ్చిన మరో 8 ఓట్లను చెల్లనివిగా పరిగణించడం తగదని స్పష్టం చేసింది. ఆ ఎనిమిది ఓట్లు సరిగ్గానే పడ్డాయని, అవి పిటిషనర్‌కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నది. ఈ ఎనిమిది ఓట్లను పిటిషనర్‌కు వచ్చిన 12 ఓట్లతో కలుపితే 20 అవుతాయని చెబుతూ.. పిటిషనర్‌ విజయం సాధించినట్టు ప్రకటించింది.


ఉద్దేశపూర్వకంగానే రిటర్నింగ్‌ అధికారి ఆ ఓట్లు చెల్లకుండా దిద్దుబాట్లు చేశారని స్పష్టం చేసింది. తద్వరా చట్టపరమైన నిబంధనలను ఆయన ఉల్లంఘించారని పేర్కొన్నది. ఎనిమిదో రెస్పాండెంట్‌గా ఉన్న మనోజ్‌ సోన్కర్‌ గెలిచేందుకే రిటర్నింగ్‌ అధికారి ఈ ప్రయత్నం చేశారని స్పష్టం చేసింది. ఈ విషయంలో రిటర్నింగ్‌ అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే తప్పు చేయడమే కాకుండా.. కోర్టులో అసత్యపు సాక్ష్యం చెప్పారని పేర్కొన్నది. మనోజ్‌ సోన్కర్‌ తరఫున వాదించిన న్యాయవాది.. తాజా ఎన్నికలు నిర్వహించాలని కోరినా.. కోర్టు అందుకు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపులోనే తప్పిదం జరిగినందున మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. రిటర్నింగ్‌ అధికారిపై కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీడింగ్‌-1973 కింద తగిన కేసు పెట్టాలని ఆదేశించింది.