ఉప్ప‌ల్ స్టేడియంలో రికార్డ్‌లు బ‌ద్ద‌లు కొట్టిన ఎస్ఆర్‌హెచ్..మొత్తం ఎన్ని రికార్డ్‌లు న‌మోద‌య్యాయంటే..!

ఉప్ప‌ల్ స్టేడియంలో రికార్డ్‌లు బ‌ద్ద‌లు కొట్టిన ఎస్ఆర్‌హెచ్..మొత్తం ఎన్ని రికార్డ్‌లు న‌మోద‌య్యాయంటే..!

ఐపీఎల్ సీజన్‌17లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ చరిత్ర‌లో నిలిచిపోవ‌డం ఖాయం. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్స్‌ సిక్సర్ల వర్షం కురిపిస్తూ బౌల‌ర్ల‌కి పీడ‌క‌ల‌ని మిగిల్చారు. ఇరు జట్లు కలిపి 523 పరుగులు చేశాయంటే బ్యాట‌ర్ల అరాచ‌కం ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. టీ20 చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో రికార్డ్‌ల‌ని ప‌రిశీలిస్తే..

523 – బుధవారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ చేసిన పరుగులు. 2023 సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన 517 పరుగులను ఉప్ప‌ల్ మ్యాచ్‌ అధిగమించింది. ఏ టీ20 మ్యాచ్‌లో అయిన ఇదే అత్య‌ధిక స్కోరు

38 – హైదరాబాద్‌లో కొట్టిన సిక్సర్ల సంఖ్య ..ఐపీఎల్ చరిత్రలోనూ అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా కూడా ఇది చరిత్రకెక్కింది. ఈ 38 సిక్స్‌లలో ముంబై ఇండియన్స్ 20 సిక్సర్లు నమోదు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 18 సిక్స్‌లు కొట్టింది. గ‌తంలో అత్య‌ధిక సిక్స‌ర్స్ 37 ఉండ‌గా, వాటిని ఈ మ్యాచ్ అధిగ‌మించింది.

3 వికెట్లకు 277 – ముంబైపై సన్‌రైజర్స్ సాధించిన స్కోరు. ఇది ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికం. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో పూణే వారియ‌ర్స్‌పై ఆర్‌సీబీ 263 ప‌రుగులు చేసింది. 11 ఏళ్ల త‌ర్వాత ఈ అత్య‌ధిక ప‌రుగుల రికార్డును ఆరెంజ్ ఆర్మీ బ్రేక్ చేసింది.

5 వికెట్లకు 246 – ఐపీఎల్ చరిత్రలో లక్ష్యఛేదనలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు సృష్టించింది. 246 పరుగులకు 5 వికెట్లు చేసినా.. ఆ జట్టుకు ఓటమి ఎదురు కావ‌డం విశేషం. ఈ రికార్డు గతంలో రాజస్థాన్ రాయల్స్ (223/5) పేరిట ఉండేది.

ఇక ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లోపే ఇద్ద‌రు ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్స్ అర్ధ సెంచ‌రీలు సాధించారు. ట్రావిస్ హెడ్ ఫ్రాంచైజీకి ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా రికార్డు సృష్టించాడు, మైలురాయిని చేరుకోవడానికి 18 బంతులు తీసుకున్నాడు, అభిషేక్ శర్మ అయితే కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. గ‌తంలో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌పున అర్ధ సెంచ‌రీ కోసం వార్న‌ర్ 20 బంతులు ఎదుర్కొన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక స్కోరు ఈ మ్యాచ్‌లోనే న‌మోదైంది. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఎంఐ 148/2 కాగా, 2024 లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 141/2 గా న‌మోదైంది.

14.4 – సన్‌రైజర్స్‌కు 200 పరుగుల మార్కును చేరుకోవడానికి అవసరమైన ఓవర్లు, 2016లో కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 14.1 ఓవర్లలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసింది. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ 14.4 ఓవ‌ర్స్ ఆడింది.

66 -ముంబై బౌల‌ర్ క్వేనా మఫాకా ఇచ్చిన ప‌రుగులు 2013లో రాయల్ ఛాలెంజర్స్‌పై మైఖేల్ నేజర్ ఇచ్చిన‌ 62 పరుగులను అధిగమించి కొత్త చ‌రిత్ర సృష్టించాడు మ‌ఫాకా.

81 – పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ మొత్తం సాధించిన ప‌రుగులు, ఇది ఐపిఎల్‌లో వారి అత్యధిక స్కోరు, 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై వారు సాధించిన 79 పరుగులను ఈ మ్యాచ్‌లో అదిగ‌మించారు.

18 – సన్‌రైజర్స్ బాదిన అత్య‌ధిక సిక్సర్లు – ఐపిఎల్ మ్యాచ్‌లో వారు అధికంగా ఇన్ని సిక్స‌ర్స్ కొట్టింది లేదు. ఈ సీజన్‌లో నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 15 సిక్సర్లు కొట్టారు. అదే ఇప్పటి వ‌ర‌కు అత్య‌ధికంగా ఉండేది.

హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం (మార్చి 27) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‍లో ఎస్‍ఆర్‌హెచ్ 31 పరుగుల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే.