Supreme Court | ఈసీల నిమామకంపై పిటిషన్.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. కేసు విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశానికి ఒక రోజు సమావేశం జరుగనుండడం పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం గమనార్హం. సీఈసీ-ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసును తక్షణ విచారణకు జాబితా చేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండగా.. ఇటీవల ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో రెండు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే ఉన్నారు. అంతకుముందు అనూప్ పాండే ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ పదవి విరమణ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని జయ ఠాకూర్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలను త్వరలో ప్రకటించవచ్చని పిటిషనర్ తెలిపారు.
ఎన్నికల కమిషనర్లను కూడా వెంటనే నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కమిటీలో ప్రధాని, కేంద్రమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా కొనసాగుతారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కమిటీలో సభ్యుడిగా ఉండగా.. కొత్త చట్టంలో సీజేఐ స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. సీజేఐని తప్పించిన అనంతరం ఎన్నికల కమిషన్‌లను కేంద్రం ఎంపిక చేస్తుండడంతో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పబోతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత జయా ఠాకూర్‌తో పాటు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సైతం విచారణ జరపనున్నట్లు తెలుస్తున్నది.