Viral Video | స‌రిగ్గా రాయ‌డం లేద‌ని.. వీపు క‌మిలేలా 35 దెబ్బ‌లు కొట్టిన టీచ‌ర్

Viral Video | స‌రిగ్గా రాయ‌డం లేద‌ని.. వీపు క‌మిలేలా 35 దెబ్బ‌లు కొట్టిన టీచ‌ర్

Viral Video | ఓ విద్యార్థిని ప‌ట్ల టీచ‌ర్ క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. నోట్ బుక్‌లో స‌రిగా రాయ‌డం లేద‌ని చెప్పి.. చిన్నారిని టీచ‌ర్ చిత‌క‌బాదింది. ఒక‌ట్రెండు దెబ్బ‌లు కాదు.. వీపు, చెంప‌లు క‌మిలేలా 35 దెబ్బ‌లు కొట్టింది. ఈ దారుణ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. సూర‌త్‌లోని సాధ్నా నికేతన్ స్కూల్లో.. ఓ నాలుగేండ్ల విద్యార్థిని ఎల్‌కేజీ చ‌దువుతోంది. అయితే ఆ విద్యార్థిని స‌రిగ్గా రాయ‌డం లేద‌ని చెప్పి.. టీచ‌ర్ జ‌శోదా కోఖ‌రి విసుగు చెందారు. దీంతో చిన్నారి చేత రాయిస్తూ.. ఆమె వీపుపై టీచ‌ర్ ప‌దేప‌దే కొట్టింది. చెంప‌లు కూడా వాయించింది.

సాయంత్రం స్కూల్ ముగిశాక చిన్నారి ఇంటికి చేరుకుంది. ఆమె దుస్తులు విప్పి చూడ‌గా వీపు అంతా క‌మిలిపోయింది. చెంప‌లు ఎర్ర‌గా మారాయి. దీంతో ఏమైంద‌ని ప్ర‌శ్నించ‌గా, టీచ‌ర్ కొట్టింద‌ని చిన్నారి ఏడుస్తూ చెప్పింది. విద్యార్థిని త‌ల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి టీచ‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా, తానేమీ కొట్ట‌లేద‌ని బుకాయించింది.

త‌ర‌గ‌తి గ‌దిలో ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించగా, బాధిత చిన్నారిని టీచ‌ర్ 35 సార్లు కొట్టిన‌ట్లు తేలింది. దీంతో స్కూల్ యాజ‌మాన్యం, విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. జ‌శోదాను విధుల నుంచి తొల‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై విద్యాశాఖ సీరియ‌స్‌గా స్పందించి, విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ అనంత‌రం చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.