ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జిలు బదిలీ

తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చిల్లకూరు సుమలత, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్‌ను బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమలతను కర్ణాటక, సుధీర్ కుమార్‌ను మద్రాస్ హైకోర్టులకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆగస్టు 10న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నికేంద్ర న్యాయశాఖ మంత్రి మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జస్టిస్ చిల్లకూరు సుమలత 2021, అక్టోబర్ 15న తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2007లో ఆమె జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. కర్నూల్, గుంటూరు జిల్లాల్లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా, హైదరాబాద్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పని చేశారు.
జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ 2022, మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 1994, డిసెంబర్ 21న న్యాయవాదిగా తన వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన కేఎల్ యూనివర్సిటీ, విజ్ఞాన జ్యోతి సొసైటీ నిర్వహించే విద్యాసంస్థలు, పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు లీగల్ అడ్వయిజర్‌గా పని చేశారు. హైకోర్టు, సిటీ సివిల్ కోర్టులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో న్యాయవాదిగా కేసులు వాదించారు.
వీరితో పాటు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్‌కుమార్ సింగ్‌ను మద్రాస్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బీ షరాఫ్‌ను అలహాబాద్, జస్టిస్ బిబేక్ చౌధురీని పాట్నా హైకోర్టులకు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.