టీ20 ప్రపంచ కప్ జట్టు ఇదే.. తెలుగోడికి ఛాన్స్ మిస్..!

గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత్ చాలా బాగా రాణించి ఫైనల్ మ్యాచ్‌లో బోల్తా పడింది. దీంతో కోట్లాది మంది ప్రజల కలలు చెల్లాచెదురయ్యాయి. ఇక ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుండగా, ఈ మెగా టోర్నీలో అయిన భారత జట్టు సత్తా చాటి కప్ దక్కించుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయగా, జూన్ 1న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 29న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. భారత్ జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది.
అయితే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కి సంబంధించి ఎవరెవరు బరిలోకి దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లందరినీ వన్డేలకు పరిమితం చేసిన బీసీసీఐ.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం కుర్రాళ్లకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని అనుకుంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మరోసారి వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదు కాబట్టి టీ20 వరల్డ్ కప్‌లో అయిన వారు అత్యద్భుతమైన ప్రదర్శన కనబరచి కప్ సాధించిపెట్టేందుకు గాను కృషి చేస్తారని నమ్మిన బీసీసీఐ మెగా టోర్నీకి వారిద్దరిని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతుందనే సంకేతాలను బీసీసీఐ ఇచ్చింది.
ప్రస్తుతం 20 మంది ఆటగాళ్లతో ప్రపంచకప్‌కు టీమ్‌కాంబినేషన్‌ను ఎంపిక చేసే ప్రయత్నం జరగుతుండగా, గతేడాదిగా టీ20లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్.. టీ20 ప్రణాళికల్లో ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ప్రస్తుతం జితేశ్ శర్మకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నప్పటికీ ఐపీఎల్ తర్వాత వేరే వారు రావొచ్చనే టాక్ కూడా నడుస్తుంది. ఐపీఎల్‌లో రిషభ్ పంత్ సత్తా చాటితే అతనే ప్రధాన వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఆడటం ఫైనల్. బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కనుంది. ఇక మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. అఫ్గాన్‌తో సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న శివమ్ దూబేను కూడా ఎంపిక చేసిని ఆశ్చర్యపోనక్కర్లేదు. బౌలర్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కడం ఖాయం. స్పిన్నర్స్‌గా రవీంద్ర జడేజాతో పాటు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. మహమ్మద్ షమీ ఫిట్‌నెస్‌పై అతని టీ20 ప్రపంచకప్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ.. జైస్వాల్ సూపర్ పెర్ఫామెన్స్‌తో తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు గల్లంతు అయ్యిందనే చెప్పాలి..