పరీక్షల వేళ మెదడు చురుగ్గా పని చేయాలంటే.. ఈ ఆహారం తప్పనిసరి..!
పరీక్షలు కొనసాగినన్ని రోజులు మెదడు చురుగ్గా పని చేయాలి. లేదంటే మనం చదివింది ధ్యాసకు ఉండదు. మెదడు చురుగ్గా పని చేయాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి.

వార్షిక పరీక్షల సమయం వచ్చేసింది. ఇంటర్ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పదో తరగతి పరీక్షలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీంతో పిల్లల్లో ఒక రకమైన ఆందోళన ఏర్పడుతుంది. చదివింది గుర్తుండక ఒత్తిడికి లోనవుతారు. సరిగా నిద్రపోరు. తిండి కూడా సరిగ తినరు. కానీ సమయానికి తినకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అప్పుడు పరీక్షలు కూడా సరిగా రాయలేరు. కాబట్టి పిల్లలకు ఈ పరీక్షల వేళ ఎలాంటి ఫుడ్ ఇస్తే ఉత్తమమో తెలుసుకుందాం.
-పరీక్షలు కొనసాగినన్ని రోజులు మెదడు చురుగ్గా పని చేయాలి. లేదంటే మనం చదివింది ధ్యాసకు ఉండదు. మరి మెదడు చురుగ్గా పని చేయాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్‌తో కూడిన అల్పాహారం తినాలి. ఇడ్లీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. యాపిల్, బొప్పాయి పండ్లు తినడం ఉత్తమం.
-ఇక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు మాత్రం గ్రీన్ వెజిటబుల్స్‌ను తీసుకుంటే మంచిది. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆరెంజ్, గ్రేప్స్, యాపిల్స్ వంటి పండ్లను తీసుకోవచ్చు.
-ఒత్తిడిని అధిగమించేందుకు నీటిలో కరిగే విటమిన్స్‌ను అధికంగా తీసుకోవాలి. కొవ్వు శాతం అధికంగా ఉండే ఫుడ్‌ను తగ్గించాలి.
-ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. వాల్ నట్స్, చేపలు తీసుకుంటే మంచిది.
-మైండ్ రిలీఫ్ కోసం అరగంటకు ఒకసారైనా ఒక గ్లాస్ మంచినీళ్లు తాగాలి. ముందే ఎండాకాలం కాబట్టి.. నీళ్లు తాగడం మరిచిపోవద్దు. మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలి. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్ డ్రింక్స్, కాఫీ, టీల జోలికి వెళ్లకూడదు.
-స్నాక్స్ తీసుకోవాలి. కానీ, కొవ్వు, షుగర్ లెవల్స్ అధికంగా ఉన్న స్నాక్స్ తీసుకోకూడదు.