వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్.. ఒక్క వికెట్‌తో గెలిచి పాక్ ప‌ని ఖ‌తం చేసిన సౌతాఫ్రికా

వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్.. ఒక్క వికెట్‌తో గెలిచి పాక్ ప‌ని ఖ‌తం చేసిన సౌతాఫ్రికా

ఇన్నాళ్లు వ‌రల్డ్ క‌ప్‌లో థ్రిల్లింగ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌డం లేద‌ని నిరాశ‌లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కి సౌతాఫ్రికా, పాకిస్తాన్ మ్యాచ్ మంచి మ‌జాని అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ వ‌చ్చిన ఈ గేమ్‌లో చివ‌రికి విజ‌యం సౌతాఫ్రికానే వ‌రించింది. హ్యాట్రిక్ విజయాలను సౌతాఫ్రికా త‌న ఖాతాలో వేసుకోగా, వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్, సెమీస్ రేసు నుంచి త‌ప్పుకున్న‌ట్టే అయింది. ఇక పాక్, సెమీస్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరిగి తీరాల్సిందే అంటున్నారు విశ్లేష‌కులు. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఈజీగా గెల‌వాల్సి ఉన్న‌ప్ప‌టికీ, పాక్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో మ్యాచ్ క‌ష్టం మీద గెలిచింది. 79 బంతుల్లో 36 పరుగులు. చేతిలో ఐదు వికెట్లు ఉండ‌గా, ఇది చూసిన వారు ఎవ‌రైన‌ సౌతాఫ్రికా ఈజీగా గెలుస్తుందని అనుకున్నారు. కాని కేవ‌లం ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.

మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, 46.4 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అబ్దుల్లా షెఫీక్ 9, ఇమామ్ ఉల్ హక్ 12, మహ్మద్ రిజ్వాన్ 31, ఇఫ్తికర్ అహ్మద్ 21 పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం 50 పరుగులు చేశాడు. త‌ర్వాత వ‌చ్చిన షాదబ్ ఖాన్ 43, సౌద్ షకీల్ 52 పరుగులు చేయగా షాహీన్ ఆఫ్రిదీ 2, మహ్మద్ వసీం 7 పరుగులు చేయ‌డంతో పాక్ 270 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌల‌ర్స్‌లో మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీయగా తబ్రేజ్ షంసీ 4 వికెట్లు , గెరాల్డ్ కాట్జేకి 2 వికెట్లు , లుంగి ఎంగిడికి ఓ వికెట్ దక్కింది. ఇక 271 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. అంపైర్స్ కాల్ అనే నిబంధనతో గెలిచిట్టు అయింది.

లక్ష్యచేధనలో సౌతాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా, . పాకిస్థాన్ విజయానికి ఒక్క వికెట్ అవసరం అయింది. ఇక సౌతాఫ్రికా గెలుపునకు 11 పరుగులు చేయాలి. ఆ స‌మ‌యంలో పాకిస్థాన్‌ను దురదృష్టం వెక్కిరిస్తే.. సౌతాఫ్రికాకు అదృష్టం కలిసొచ్చింది. హ్యారీస్ రౌఫ్ వేసిన 46వ ఓవర్ చివరి బంతికి షంసీ వికెట్ల ముందు దొరికిపోగా, పాకిస్థాన్ ఆటగాళ్లు గట్టి అప్పీల్ చేసారు. ఆ స‌మ‌యంలో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే బాబర్ ఆజామ్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను లైట్‌గా ముద్దాడటంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చి ఉంటే షంసీ ఔట‌య్యేవాడు. సౌతాఫ్రికా 263 పరుగులకే ఆలౌటయ్యేది. దాంతో పాకిస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించేది. కానీ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఫలితం తారుమారు అయింది.