సుప్రీం తీర్పుతో దిగొచ్చిన తమిళ గవర్నర్.. అసెంబ్లీకి పది బిల్లులు
బిల్లులకు సమ్మతిని తెలియజేయడంలో తీవ్ర జాప్యంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ పది బిల్లులను అసెంబ్లీకి పంపారు.

- పది బిల్లులు ప్రభుత్వానికి పంపిన రవి
- శనివారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
చెన్నై: గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లులను ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ శనివారం నుంచి ప్రత్యేకంగా సమావేశం కానున్నది. బిల్లులకు సమ్మతి తెలియజేయడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు గవర్నర్ తీరును తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యంలో దిగొచ్చిన గవర్నర్.. తన వద్ద పెండింగ్‌లో ఉంచుకున్న పది బిల్లులను అసెంబ్లీకి పంపారు.
గవర్నర్లు బిల్లులను తమ వద్ద పెడింగ్‌లో ఉంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఇటీవలి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తం 12 బిల్లులను గవర్నర్ తొక్కిపట్టారు. అందులో పదింటిని తాజాగా తిప్పి పంపారు. వాటిలో ఎక్కువ భాగం యూనివర్సిటీలకు సంబంధించినవే. దీంతో ఆ బిల్లులను తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ సమావేశాల్లో సదరు బిల్లులకు మళ్లీ ఆమోదం పొందుతామని స్పీకర్ ఎం అప్పవు చెప్పారు.