మంత్రి కోమటి రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో సినీ పరిశ్రమలకు చెందిన పలువురు పెద్దలు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిశారు.

విధాత : సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సినీ రంగ ప్రముఖులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చాలు అందించి శాలువలతో సన్మానించారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్ ఆధ్వర్యంలో వారు మంత్రిని కలిశారు. 15 మందితో కూడిన టాలీవుడ్ టీమ్ మంత్రిని కలిసింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు రాయితీల ప్రతిపాదనలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రిని కలిసిన వారిలో ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు కూడా ఉన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో మర్యాదపూరకంగా మంత్రిని కలిశామని దిల్రాజు వెల్లడించారు. సినిమా రంగ పురోభివృద్ధి వీలైనంత సహాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. సినీ ఇండస్ట్రీని హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణలోని ఇతర నగరాల్లో కూడా విస్తరించాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. దీనికి సహకరిస్తామని మంత్రి చెప్పారని తెలిపారు.