నాడు నాలుగు నెలలు.. నేడు 44 రోజులు.. అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగనున్న ఎన్నికలు ఇవే..
18వ లోక్‌సభకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. స్వతంత్ర భారతంలో 1951-52 తొలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం కొనసాగనున్న ఎన్నికలు ఇవే. నాడు నాలుగు నెలలకు పైగా.. ఏకంగా 68 దశల్లో పోలింగ్ నిర్వహించారు. 1951, అక్టోబర్ 25 నుంచి 1952, ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించారు. తొలి పార్లమెంట్ ఎన్నికలు.. 25 రాష్ట్రాల్లో 489 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
1962 నుంచి 1989 మధ్యకాలంలో నాలుగు రోజుల నుంచి 10 రోజుల మధ్య ఎన్నికలు నిర్వహించారు. 1980లో జరిగిన సాధారణ ఎన్నికలను నాలుగు రోజుల్లోనే ముగించేశారు. ఇప్పటి వరకు జనరల్ ఎలక్షన్స్‌ను పరిశీలిస్తే అత్యంత తక్కువ కాలం ఇదే. 2004లో నాలుగు దశలకు 21 రోజుల సమయం పట్టింది. 2009లో ఐదు దశలు నెల రోజుల పాటు కొనసాగాయి. 2014లో తొమ్మిది దశల్లో 36 రోజుల పాటు ఎన్నికలు నిర్వహించారు. 2019లో 39 రోజుల పాటు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు.