కాకి ‘కాల‌జ్ఞాని’.. బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించే ఒకే ఒక్క‌ పక్షి ‘కాకి’ మాత్ర‌మే

కాకి ఓ కాల‌జ్ఞాని.. ఎందుకంటే ఓ మంచి సందేశం ఇచ్చే పక్షి కాకి అనే చెప్పుకోవాలి. ఎంతో విచక్షణ ఉందని చెప్పుకునే మనుషులు కాకి జీవనశైలి ముందు తలవంచాల్సిందే.

కాకి ‘కాల‌జ్ఞాని’.. బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించే ఒకే ఒక్క‌ పక్షి ‘కాకి’ మాత్ర‌మే

కాకి.. ఈ పేరు విన‌ని వారుండ‌రు. ఈ ప‌క్షిని చూడ‌ని వారు కూడా ఉండ‌రు. కాకి అంద‌రికీ సుప‌రిచిత‌మే. అయితే కాకిని చాలా మంది అశుభంగా ప‌రిగ‌ణిస్తారు. కాకి ఇంటి ముందు వ‌చ్చి అరిచినా, ఇంట్లోకి ప్ర‌వేశించినా ఆందోళ‌న‌కు గుర‌వుతారు. ఆ రోజు ఏదో చెడు జ‌రుగుతుంద‌ని భావిస్తారు. కానీ కాకి ఓ కాల‌జ్ఞాని.. ఎందుకంటే ఓ మంచి సందేశం ఇచ్చే పక్షి కాకి అనే చెప్పుకోవాలి. ఎంతో విచక్షణ ఉందని చెప్పుకునే మనుషులు కాకి జీవనశైలి ముందు తలవంచాల్సిందే. ప్రకృతిలో ఎన్ని మార్పులొచ్చినా తన జీవనశైలిని, పకృతి ధర్మాన్ని మార్చుకోని ఒకేఒక పక్షి కాకి. అందుకే ‘కాకిని కాలజ్ఞాని’ అంటారు.

బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించే ఒకే ఒక్క‌ పక్షి కాకి

వేకువ జామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి మాత్ర‌మే అని పురాణాలు చెబుతున్నాయి. సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికిచేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకి కాలజ్ఞాని అంటారు. సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాకులు ఆహారం ముట్టుకోవు. తినే నాలుగు మెతుకులు అందరితో పంచుకుని తింటుంది.

ఎంతో గోప్యంగా సంభోగం..

ఆడ కాకి, మగ కాకి పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కాకుల‌కు కలిగి ఉండటం గొప్ప విష‌యం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోద‌న‌లు చేసి స్నానమాచరించి గూటికిచేరే మంచి ఆచరణ కూడా కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే అలవాటు, సమయపాలన కూడా కాకులదే.