Dinosaur Skeleton | వేలంలో రికార్డు ధర పలికిన డైనోసార్ అస్థిపంజరం.. రూ.373కోట్లు పోసి కొన్న సిటాడెల్ వ్యవస్థాపకుడు..!
Dinosaur Skeleton | సిటాడెల్ వ్యవస్థాపకుడు, సీఈవో కెన్ గ్రిఫిన్ సుమారు 44.6 మిలియన్ డాలర్లు పోసి ఓ డైనోసార్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.373 కోట్లు. గత వేలం రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ ఆయన ఈ డైనోసర్ అస్థిపంజరాన్ని దక్కించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది.

Dinosaur Skeleton | సిటాడెల్ వ్యవస్థాపకుడు, సీఈవో కెన్ గ్రిఫిన్ సుమారు 44.6 మిలియన్ డాలర్లు పోసి ఓ డైనోసార్ అస్థిపంజరాన్ని కొనుగోలు చేశారు. భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.373 కోట్లు. గత వేలం రికార్డులన్నింటిని బద్దలు కొడుతూ ఆయన ఈ డైనోసర్ అస్థిపంజరాన్ని దక్కించుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రచురించింది. అమెరికా న్యూయార్క్ నగరంలో ‘సోథెబైస్’ ఇటీవల నిర్వహించిన వేలంలో వేలం పాడి దక్కించుకున్నట్లుగా తెలిపింది. కెన్ గ్రిపిక్ కొనుగోలు చేసిన డైనోసార్ అస్థిపంజరం భారీగా ఉంటుందని.. చెక్కు చెదరదని వివరించింది. వేలం చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ధరకు విక్రయమైన శిలాజ వస్తువు ఇదేనని పేర్కొంది. ఇక ఈ డైనోసార్ అస్థిపంజరం దాదాపు 150 మిలియన్ సంవత్సరాల పురాతనమైందని అంచనా.
ఈ భారీ అస్థిపంజరానికి ‘అపెక్స్’ అని పేరుపెట్టారు. కొలరాడోలోని డైనోసార్ అనే ప్రాంతానికి వెలుపల మే 2022లో తవ్వకాల చేపట్టిన పాలియోంటాలజిస్ట్ జాసన్ కూపర్ దీన్ని గుర్తించారు. ఇప్పటివరకు కనుగొన్న డైనోసార్ అస్థిపంజరాల్లో ‘అపెక్స్’ అతి పెద్దదని వేలం నిర్వహణ సంస్థ ‘సోథెబైస్’ తెలిపింది. దీని ఎత్తు 11 అడుగులు, 27 అడుగుల పొడవు ఉందని తెలిపింది. అస్థిపంజరంలో మొత్తం 319 ఎముకలు ఉంటాయని అంచనా వేయగా అందులో 254 ఎముకలు చెక్కు చెదరకుండా ఉన్నాయని వివరించింది. ఈ అస్థిపంజరాన్ని దక్కించుకునేందుకు ఆరుగురు పోటీపడ్డారు. 15 నిమిషాల పాటు వేలంపాట కొనసాగింది. కెన్ గ్రిఫిన్ ఈ అస్థిపంజరాన్ని దక్కించుకున్నారు. నిజానికి ఈ అస్థిపంజరం 6 మిలియన్ డాలర్ల వరకు అమ్ముడుపోతుందని అంచనా వేశారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 44.6 మిలియన్ డాలర్లు పలికింది. అంచనా కంటే ఏకంగా 11 రెట్లు అధిక ధర విశేషం. ఇదిలా ఉండగా.. ఫోర్బ్స్ ప్రకారం కెన్ గ్రిఫిన్ సంపద సుమారు 37.8 బిలియన్ డాలర్లు.