Tollywood Strike : సమ్మె ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల మంత్రులతో నిర్మాతల కీలక భేటీ!

సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతలు తెలుగు రాష్ట్రాల మంత్రులతో కీలక చర్చలు జరిపారు. వేతన పెంపు, షూటింగ్ నిలిపివేతపై సమీక్ష.

Tollywood Strike : సమ్మె ఎఫెక్ట్..తెలుగు రాష్ట్రాల మంత్రులతో నిర్మాతల కీలక భేటీ!

Tollywood Strike | విధాత : తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదం పరిష్కార ప్రయత్నాల్లో భాగంగా నిర్మాతలు సోమవారం త తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ తో కీలక భేటీలు నిర్వహించారు. సినీ కార్మికుల సమ్మె, షూటింగ్‌ల నిలిపివేత వంటి కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు కోరుతూ సమ్మె బాట పట్టడంతో, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో చర్చలు విఫలమవడంతో షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి దిల్‌ రాజుకు బాధ్యత అప్పగించినట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రముఖ నిర్మాతలైన దిల్‌ రాజు, సుప్రియ, బన్ని వాసు, దానయ్య, , నాగవంశీ, బీవీఎస్ఎన్‌ ప్రసాద్, బాపినీడులు హైదరాబాద్ లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రితో సమావేశమయ్యారు. సమ్మెను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వెంకట్ రెడ్డితో భేటీలో నిర్మాతలు టికెట్ల పెంపుకు కార్మికుల వేతనాలకు సంబంధం లేదన్నారు. అధిక టికెట్ రేట్లు పొందిన చిత్రాల నుంచి నిర్థిష్ట ఫీజు వసూలు చేసి ఆ నిధిని కార్మిక సంక్షేమానికి వినియోగించవచ్చన్నారు. 30శాతం వేతనం పెంపు ప్రతిపాదన సాధ్యం కాదని..జూన్ 2025నాటికి ఉన్న ధర సూచిక ఆధారంగా సవరణను ఆమోదించాలని..నిర్మాతల స్వేచ్చను చట్టపరంగా రక్షించాలని, ఒప్పందాల ఆధారంగా నియామకాలు జరుగాలని, కార్మిక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు.

ఏపీ మంత్రి దుర్గేష్ తో సమ్మెపై చర్చలు

అంతకుముందు ఏపీ సచివాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ భేటీలో టాలీవుడ్ కార్మికుల చేస్తున్న సమ్మె వివరాలను మంత్రికి వివరించారు. అలాగే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా నిర్మాతలు సినీ రంగ సమస్యలు, కార్మికుల సమ్మెపై మంత్రి దుర్గేష్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఈ భేటీకి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని..సినీ కార్మికుల సమ్మెలపై చర్చించామన్నారు. సినీ కార్మికులు, సినీ నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలు వింటాం అని పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. ప్రభుత్వ జోక్యం అవసరం అయితే వారిద్దరు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఫెడరేషన్‌, ఛాంబర్‌ కలిసి కూర్చుని మాట్లాడుకుని సమ్మెకు తెరదించాలన్నారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము.. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం అని దుర్గేష్ తెలిపారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. . స్టూడియో నిర్మాణాలు జరిగితే యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఫ్రెండ్లీ వాతావరణంలో ఏపీ లో చిత్ర పరిశ్రమ ఉండాలనేది అందరి ఆకాంక్ష అని..సీఎం, డిప్యూటీ సీఎం తో సమావేశం ఏర్పాటు చేయాలనీ నిర్మాతలు తనను కోరారని వెల్లడించారు. నంది అవార్డ్స్ పైన కూడా చర్చ జరిగిందని… ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్ ఇస్తాం. దీని మీద రెండు, మూడు ప్రతిపాదనలు అలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంటే నంది అవార్డ్స్ అనే పేరు ఉంది. ఏపీలో నంది అవార్డ్స్ పేరు మార్చే ఆలోచన లేదు’ అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం రూ.37 కోట్ల పెట్టుబడి పెట్టిన అమెజాన్

పర్యాటకుడిపై ఏనుగు దాడి..వైరల్ గా వీడియో