Dharmasthala Case | ‘మాస్క్’ తొలగించారు! ధర్మస్థల సామూహిక ఖననం కేసులో బిగ్ ట్విస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో శనివారం భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఖననాల విషయంలో తాను అబద్ధం చెప్పానని, అలా చేయమని తనను కొందరు పురికొల్పారని సాక్షి చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడి పేరు, ఫొటో బయటపెట్టారు.

Dharmasthala Case | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. కీలకంగా ఉన్న సాక్షి పారిశుధ్య కార్మికుడిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడికి ఉన్న గోప్యతను తొలగించారు. ఆ పారిశుధ్య కార్మికుడి పేరు సీఎన్ చిన్నయ్య అలియాస్ చిన్న.. అని ప్రకటించారు. అతడి ఫొటోను కూడా విడుదల చేశారు. ధర్మస్థలలో తవ్వకాలు జరిపిన సిట్ అధికారులకు అక్కడ రెండు అస్థిపంజరాల అవశేషాలు మినహా చిన్నయ్య చెప్పినట్లుగా అనుమానాస్పద.. హత్యకు గురైన మృతదేహాల ఆనవాళ్లు దొరకని విషయం తెలిసిందే. సాధారణంగా దర్యాప్తు ముగిసిన అనంతరం చిన్నయ్యను అతడి లీగల్ టీమ్‌తో పాటు పంపించేసేవారు. కానీ.. శుక్రవారం సాయంత్రం అతడిని తమ కస్టడీలోనే ఉంచుకున్నసిట్ అధికారులు.. బాగా పొద్దుపోయే వరకూ అతడిని ప్రశ్నించిన క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను ఫిర్యాదు చేసిన సమయంలో పోలీసులకు అందించిన పుర్రె తాను గతంలో పూడ్చానని చెబుతున్నవాటిలో ఒకటి కాదని అంగీకరించాడు. ఈ పుర్రె ఎక్కడ తవ్వి తీశాడన్న విషయంలో పోలీసులు అతడిని ప్రశ్నించిన సమయంలో సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అతడు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌కు, సమర్పించిన డాక్యుమెంట్లలో ఉన్న తేడాలపైనా అతడు సరైన సమాధానాలు ఇవ్వలేక పోయాడు. తనకు ఓ వ్యక్తి పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమన్నాడని, కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారని అతను వెల్లడించాడు. దీంతో వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అటు తన కుమార్తె అనన్య భట్ అదృశ్యమైందని చెప్పిన మహిళ సుజాత భట్ సైతం మీడియా ముందుకు వచ్చి, పొంతనలేని మాటలు చెప్పారు. తాను ఈ విషయంలో అబద్ధం చెప్పానన్న సుజాత.. తాను చెప్పిన అనన్య పేరు తన స్నేహితురాలి కుమార్తెదని, ఆమె కూడా హత్యకు గురైందని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. దీంతో ధర్మస్థల వ్యవహారం అనూహ్య మలుపు తీసుకున్నట్లయ్యింది.
ఆ పుర్రె పూడ్చినది కాదు..
తాను ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను పాతిపెట్టానని సాక్షి చెప్పినదంతా కట్టేకథేనని గుర్తించిన అనంతరం అతడిని అరెస్టు చేసినట్టు సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి మీడియాకు తెలిపారు. ముసుగు వేసుకుని తవ్వకాలలో సిట్ అధికారులకు మార్గదర్శకం చేస్తూ కనిపించిన సాక్షి.. కట్టుకథతో అందరినీ ఇబ్బంది పెట్టాడని సిట్ అధికారులు చెబుతున్నారు. అరెస్టు నేపథ్యంలో ఇప్పటిదాకా సాక్ష్యాల చట్టం కింద అతడికి కల్పించిన ఆంతరంగిక గోప్యతను పోలీసులు తొలగించారు. అతడి పేరు, ఫొటోను బయటపెట్టారు.
ఈ కేసులో సిట్ అధికారులు నిందితుడిని బెళ్తంగడి కోర్టులో హాజరుపర్చగా అతడిని విచారణ నిమిత్తం పది రోజులపాటు సిట్‌కు అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సాక్షి అందించిన పుర్రె ధర్మస్థలలో తవ్వి తీసినది కాదని, అదొక లేబొరేటరీ నుంచి తీసుకొచ్చినదని భావిస్తున్నారు. సిట్‌ను తప్పుదోవ పట్టించినందుకు అతడిపై తప్పుడు సాక్ష్యాలు, అసత్య ప్రమాణం కింద కేసు నమోదు చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారంలో అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ రెండూ ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హగ్గడేకు మద్దతుగా నిలిచాయి. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం హెచ్చరించారు.
భారీ కుట్ర : బీజేపీ కర్ణాటక చీఫ్
సాక్షి అరెస్టు నేపథ్యంలో బీజేపీ కర్ణాటక చీఫ్ బీవై విజయేంద్ర ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ఇదొక భారీ కుట్రగా అభివర్ణించారు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ‘ఇవాళ ధర్మస్థల. రేపు మరో ఆలయం. మొత్తం అజెండా హిందూత్వ వ్యతిరేకత. ఈ కుట్రలో కమ్యూనిస్టులు, వామపక్షవాదుల హస్తం కూడా ఉంది’ అని ఆయన ఆరోపించారు. మాస్క్ మనిషి, సుజాత భట్ ఎవరో ఆదేశాల మేరకు ఆడారని బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టి ఆరోపించారు. స్థానిక పోలీసులు ఫిర్యాదుదారుడికి నార్కో ఎనాలిసిస్ పరీక్ష చేసిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడంపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మస్థలలో పెద్ద సంఖ్యలో శవాలను పూడ్చిపెట్టారనే వాదనల వెనుక భారీ ఫండింగ్ ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రామా కొనసాగేలా చేసిందని అన్నారు. అయితే.. బీజేపీ నేతల వాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. బీజేపీ నాయకులు గోడమీద పిల్లులని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సిట్ దర్యాప్తును ప్రతి ఒక్కరూ స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ధర్మస్థల కుటుంబం స్వయంగా ముఖ్యమంత్రిని కలిసింది. మేం మంచి పని చేస్తున్నామని చెప్పింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఎవరిది తప్పయితే వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. మతం పేరిట రాజకీయం చేయద్దనే మేం చెబుతున్నాం’ అని శివకుమార్ అన్నారు.