భార్యపై అనుమానంతో రెండేళ్ల బాలుడిని చంపిన తండ్రి

భార్యపై అనుమానంతో కన్న కొడుకునే హింసించి చంపిన కసాయి తండ్రి... వారం రోజులుగా తిండి పెట్టకుండా కడుపు మాడ్చి, చివరకు నిద్ర మాత్రలు వేసి చంపిన ఘటన

భార్యపై అనుమానంతో రెండేళ్ల బాలుడిని చంపిన తండ్రి

– గద్వాల జిల్లా ఐజ పట్టణంలో దారుణం

– నాలుగు నెలలుగా భార్యను ఇంట్లో గొలుసుతో కట్టేసి చిత్రహింసలు

– వారం క్రితం తప్పించుకుని ఇంట్లోంచి వెళ్లి పోయిన భార్య

– భార్య వెళ్లిపోవడంతో రెండేళ్ల బాలుడిపై పైశాచికం

– చిత్రహింసలకు తట్టుకోలేక బాలుడి మృతి

– పోలీసుల అదుపులో నిందితుడు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: భార్యపై అనుమానంతో కన్న కొడుకునే హింసించి చంపిన కసాయి తండ్రి… వారం రోజులుగా తిండి పెట్టకుండా కడుపు మాడ్చి, చివరకు నిద్ర మాత్రలు వేసి చంపిన ఘటన గద్వాల జిల్లా ఐజ పట్టణంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఐజ పట్టణానికి చెందిన కమ్మరి బాబు (36)కు భార్య శ్రావణి, కూతురు, కుమారుడు ఉన్నారు. కొంతకాలం నుంచి బాబు తన భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇంట్లో తరచూ భార్యతో గొడవ పడేవాడు. తనకెలాంటి సంబంధం లేదని చెప్పినా వినేవాడు కాదు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అనుమానం మరింత పెంచుకున్నాడు. భార్యాపిల్లలను ఇంట్లోనే బంధించాడు. మూడేళ్లుగా ఎవ్వరినీ బయటకు పంపేవాడు కాదు. ఇంట్లోనే ఉంటూ అందరని హింసించేవాడు.


 



నాలుగు నెలల నుంచి భార్యను ఇనుప గొలుసుతో కట్టేసి ఇంట్లో ఉంచి ఒకే పూట భోజనం పెట్టేవాడు. బయటి ప్రపంచంతో వారికి సంబంధం లేకుండా చేసాడు. ఇంట్లో హింసకు భరించలేక వారం క్రితం శ్రావణి తన కూతురిని వెంటబెట్టుకుని ఇంట్లో నుంచి తప్పించుకుని ఎటో వెళ్లిoది. ఇది గుర్తించిన బాబు భార్యపై కోపంతో ఇంట్లో ఉన్న రెండేళ్ల కుమారుడికి నరకం చూపించాడు. తిండి పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా హింసించేవాడు. నాలుగు రోజుల నుంచి నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేవాడు. అయినా ప్రాణం తో ఉంటున్నాడని బుధవారం రాత్రి అధిక మోతాదులో మాత్రలు వేశాడు. దీంతో తెల్లారేసరికి పిల్లాడు విగతజీవి అయ్యాడు. ఎప్పుడూ ఇల్లు మూసుకునే ఉండేవాడని, ఇంట్లో ఏమి జరుగుతుందో తెలియదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. బాలుడు చనిపోయిన తరువాత ఇల్లు తెరిచిన బాబు తప్పించుకునే క్రమంలో గ్రామస్తులు అడ్డుకోవడoతో అసలు విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతో ఇదంతా చేసానని పోలీసుల ఎదుట నిందితుడు చెప్పినట్లు సమాచారం.