మొయినాబాద్ యువతి దహనం కేసులో పురోగతి
హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లో యువతి దహనం కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. మృతురాలిని మల్లేపల్లికి చెందిన తహసిన్ బేగం(22) గా పోలీసులు గుర్తించారు

విధాత : హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లో యువతి దహనం కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. మృతురాలిని మల్లేపల్లికి చెందిన తహసిన్ బేగం(22) గా పోలీసులు గుర్తించారు. తమ కుమార్తె కనిపించట్లేదని ఈ నెల 10న తల్లిదండ్రులు, సోదరుడు అజార్‌లు హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో హత్యకు గురైన యువతి వివరాలు తెలిశాయి. ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరిన యువతిని ఎవరు ఎందుకు హత్య చేశారు.. మొయినాబాద్‌లో ఎందుకు దహనం చేశారన్నదానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు సంఘటన స్థలానికి వచ్చేటప్పుడు..వెళ్లేటప్పుడు వేర్వేరు మార్గాలను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మొత్తం ఏడు బృందాలు పనిచేస్తున్నాయి. యువతిని వేరే చోట హత్యచేసిన నిందితులు ఇక్కడికి ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకొచ్చి దహనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తహసిన్ అదృశ్యం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై మండిపడ్డారు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలకు ఆదేశించారు.